యూపీలో గాలివాన.. మేఘ గర్జన117 మందిమృతి
ABN , Publish Date - May 15 , 2026 | 04:12 AM
ఉత్తరప్రదేశ్‌లో అకాల వర్షాలు పెను విషాదాన్ని నింపాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షాలు, పిడుగుపాట్లతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది.
72 మందికి గాయాలు
నేలకొరిగిన చెట్లు, విద్యుత్తు స్తంభాలు, దెబ్బతిన్న ఇళ్లు
పలుచోట్ల వంతెనలు కూలి నిలిచిన రాకపోకలు
సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం యోగి ఆదేశం
50 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వ్యక్తి.. సోషల్ మీడియాలో వైరల్
లఖ్‌నవూ, మే 14: ఉత్తరప్రదేశ్‌లో అకాల వర్షాలు పెను విషాదాన్ని నింపాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షాలు, పిడుగుపాట్లతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. వివిధ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో 117 మంది మృతి చెందగా, 72 మంది గాయపడ్డారు. 170 పశువులు మృత్యువాత పడ్డాయి. 227 ఇళ్లు దెబ్బతిన్నాయి. అత్యధికంగా ప్రయాగ్‌రాజ్ జిల్లాలో 24 మంది మృతి చెందగా, భదోహీలో 18 మంది, మీర్జాపూర్‌లో 15 మంది, ఫతేపూర్‌లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉన్నావ్, బదాయూన్, ప్రతా్‌పగఢ్, బరేలీ, సీతాపూర్, రాయ్‌బరేలీ, చందౌలీ జిల్లాల్లో కూడా భారీగా ప్రాణనష్టం జరిగింది. మృతుల కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం ప్రకటించింది. రాష్ట్రంలో బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి, భారీ క్యుములోనింబస్ మేఘాలు అనేక ప్రాంతాలను కమ్మేశాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలతో భారీ హోర్డింగులు, రేకుల షెడ్లు ఎగిరిపోగా, చెట్లు నేలకొరిగాయి. రోడ్లపై చెట్లు విరిగిపడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని వాహనాలు చెట్ల కింద నలిగిపోయాయి. అనేక ఇళ్లు ధ్వంసమవగా, శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. భదోహి జిల్లాలో ఓ వంతెన కూలి అనేక మంది గంగానదిలో పడిపోయారు. మీర్జాపూర్‌లో మరో వంతెన దెబ్బతిని దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రతాప్‌గఢ్, కాన్పూర్ జిల్లాలో పిడుగుపాట్లకు గురై నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బరేలీ జిల్లాలోని బమియానా గ్రామంలో భారీ గాలులకు నన్హే మియా అనే ఆటో డ్రైవర్ రేకుల షెడ్డుతో పాటు సుమారు 50 అడుగుల ఎత్తుకు ఎగిరి పక్కన ఉన్న పొలాల్లో పడిపోయాడు. కొట్టుకుపోతున్న రేకుల షెడ్డును ఆపబోయి అతడు ఈ ప్రమాదానికి గురయ్యాడు. ఈదురుగాలుల తీవ్రత ఎంత ప్రమాదకరంగా ఉందో తెలిపే ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఈ ఘటనలో చేతులు, కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడిన నన్హే మియా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలపై అధికారు లు వెంటనే స్పందించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, డివిజనల్ కమిషనర్లకు సూచించారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి తనకు నివేదికలు పంపాలని ఆదేశించారు.