Share News

హింసాత్మక నిరసనల్లో పాల్గొంటే ప్రభుత్వోద్యోగాలకు అనర్హులు

ABN , Publish Date - Oct 30 , 2026 | 02:59 AM

ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నిరుద్యోగ యువకులు అత్యంత జాగ్రత్తగా మసలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది! ఉద్యోగ నియామకాలకు సంబంధించి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం..

హింసాత్మక నిరసనల్లో పాల్గొంటే ప్రభుత్వోద్యోగాలకు అనర్హులు

  • యూపీ ప్రభుత్వం కొత్త నిబంధనలు

  • రేప్‌, హత్య, పేపర్‌ లీకేజీలు,సైబర్‌ మోసాలకు పాల్పడినవారూ అర్హులు కాదని స్పష్టీకరణ

లఖ్‌నవూ, అక్టోబరు 29: ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నిరుద్యోగ యువకులు అత్యంత జాగ్రత్తగా మసలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది! ఉద్యోగ నియామకాలకు సంబంధించి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం వ్యక్తిగత ప్రవర్తన (క్యారెక్టర్‌ వెరిఫికేషన్‌) నిబంధనలను అత్యంత కఠినతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. రాష్ట్ర పాలనలో మార్పు కోసం చోటుచేసుకునే ఆందోళనలు, నిరసనల్లో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తూ హింసాత్మక చర్యలకు పాల్పడితే సదరు యువతీయువకులకు సర్కారు కొలువు తలుపులు శాశ్వతంగా మూసుకుపోతాయని హెచ్చరించింది. ప్రస్తుత శాసన వ్యవస్థను హింసాత్మక పద్ధతుల ద్వారా మార్చడానికి లేదా అస్థిరపరచడానికి ప్రయత్నించే సంస్థల్లో సభ్యులుగా ఉన్న ఏ అభ్యర్థి కూడా ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులుకారని ఉత్తర్వుల్లో సర్కారు స్పష్టం చేసింది. అంతేనా, హత్య, దోపిడీ, అత్యాచారం, సైబర్‌ నేరాలు, మహిళల పట్ల అసభ్యప్రవర్తన, అవినీతి, తీవ్రవాద చర్యలు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్ష పత్రాల లీకేజీలకు పాల్పడిన వారిని, వ్యవస్థీకృత ముఠా (ఆర్గనైజ్డ్‌ సాల్వర్‌ గ్యాంగ్‌)లతో సంబంధాలు ఉన్న అభ్యర్థులను ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగాలకు శాశ్వతంగా అనర్హులుగా ప్రకటిస్తూ యోగి సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అభ్యర్థుల క్యారెక్టర్‌ వెరిఫికేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకు పోలీసులు.. అభ్యర్థుల సొంత జిల్లాల్లో, అలాగే వారు గత ఐదేళ్లలో ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం నివసించిన జిల్లాల్లో అభ్యర్థుల వివరాలన్నీ సేకరిస్తారు. క్యారెక్టర్‌ వెరిఫికేషన్‌ పూర్తికాకముందు ఉద్యోగంలోకి తీసుకున్నా దాన్ని తాత్కాలిక కొలువుగానే పరిగణిస్తారు. హింసాత్మక చర్యల తాలూకు కేసులను దాచిపెట్టినట్లు తేలితే వెంటనే ఉద్యోగ నియామకాన్ని రద్దు చేస్తారు. ఆ కారణంగా అభ్యర్థులు తమ పూర్తి వివరాలను నియామక దశలోనే వెల్లడించాల్సి ఉంటుంది.

Updated Date - Oct 30 , 2026 | 03:00 AM