Share News

భారత్‌, చైనాను అడ్డుకునేందుకే మాపై అమెరికా యుద్ధం!

ABN , Publish Date - Mar 05 , 2026 | 06:22 AM

భారత్‌, చైనా ప్రపంచ శక్తులుగా ఎదగకుండా అడ్డుకోవడానికే అమెరికా తమపై యుద్ధానికి దిగిందని భారత్‌లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఆలీ ఖమేనీ ప్రత్యేక ప్రతినిధి అబ్దుల్‌ మజీద్‌ హకీం ఇలాహీ...

భారత్‌, చైనాను అడ్డుకునేందుకే మాపై అమెరికా యుద్ధం!

  • ఖమేనీ ప్రత్యేక ప్రతినిధి ఇలాహీ ధ్వజం

న్యూఢిల్లీ, మార్చి 4: భారత్‌, చైనా ప్రపంచ శక్తులుగా ఎదగకుండా అడ్డుకోవడానికే అమెరికా తమపై యుద్ధానికి దిగిందని భారత్‌లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఆలీ ఖమేనీ ప్రత్యేక ప్రతినిధి అబ్దుల్‌ మజీద్‌ హకీం ఇలాహీ మండిపడ్డారు. తద్వారా తన ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడం దాని లక్ష్యమన్నారు. అగ్ర రాజ్యంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి విశ్వవ్యాప్తంగా యుద్ధాలను ఎగదోస్తోందని ఆరోపించారు. బుధవారం ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘సమీప భవిష్యత్‌లో ఇండియా, చైనా, రష్యా, అమెరికా.. నాలుగు శక్తిమంతమైన దేశాలుగా ఉంటాయి. అయితే అమెరికా భాగస్వాములను కోరుకోదు. భారత్‌, చైనా శక్తిమంతమైన దేశాలుగా ఆవిర్భవించడం అది చూడాలనుకోవడం లేదు. అందుకే ఇలాంటి యుద్ధాలను రెచ్చగొడుతూ తన ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటోంది. తాజా యుద్ధాన్ని అమెరికా, ఇజ్రాయెలే ప్రారంభించాయి.. ఇరాన్‌ కాదు. అవే మాపై దాడులు చేస్తున్నాయి. మా పౌరులపై బాంబులు వేస్తున్నాయి. మేం ఆత్మరక్షణ చేసుకుంటున్నామంతే. యుద్ధం మొదలుపెట్టింది అమెరికా కాబట్టే.. అదే ముగించాలి. వారు ఆపేస్తే మేమూ ఆపేస్తాం. ఈ రెండు దేశాలతో మేం రెండు యుద్ధాలు చేయాల్సి వస్తోంది. ఒకటి సైనిక యుద్ధం.. రెండోది ఫేక్‌ న్యూస్‌ యుద్ధం. సైనిక యుద్ధం కంటే రెండోదే అతి భారీది. ఇరాన్‌ ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారంటూ తప్పుడు కథనాలు వండివారుస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.

Updated Date - Mar 05 , 2026 | 06:22 AM