Share News

నేటి నుంచి యూఎస్‌ వీసా నిబంధనలు మరింత కఠినం

ABN , Publish Date - Mar 30 , 2026 | 04:29 AM

యూఎస్‌ వీసా నిబంధనలు సోమవారం నుంచి మరింత కఠినతరం కానున్నాయి. ఈమేరకు అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓ ప్రకటన చేసింది.

నేటి నుంచి యూఎస్‌ వీసా నిబంధనలు మరింత కఠినం

  • హెచ్‌-1బీతో పాటు మరిన్ని కేటగిరీలకూ ‘సోషల్‌ నిఘా’

న్యూఢిల్లీ, మార్చి 29: యూఎస్‌ వీసా నిబంధనలు సోమవారం నుంచి మరింత కఠినతరం కానున్నాయి. ఈమేరకు అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓ ప్రకటన చేసింది. హెచ్‌-1బీ వీసా దరఖాస్తులతో పాటు పలు ఇతర వీసా తరగతుల దరఖాస్తులను కూడా లోతుగా పరిశీలించనున్నట్లు పేర్కొంది. అమెరికాలో ప్రవేశానికి అర్హతలేని వారిపట్ల మరింత జాగురూకతతో వ్యవహరించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాన్సులేట్లకు స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ స్పష్టం చేసింది. అమెరికా ఆంతరంగిక భద్రతకు, ప్రజలకు ముప్పుగా పరిణమించే మూలాలున్న వారిని గుర్తించే క్రమంలో కఠినంగా వ్యవహరించాలని కాన్సులేట్లకు సూచించింది. దరఖాస్తుదారులకు సంబంధించిన ఇతర విషయాలతో పాటు సామాజిక మాధ్యమాల ఖాతాలనూ ఆమూలాగ్రం పరిశీలించాలని పేర్కొంది. ఇప్పటికే విద్యార్థి, ఎక్స్‌ఛేంజ్‌ వీసా(ఎం, జే కేటగిరి) దరఖాస్తుదారులకు 2025, జూన్‌ నుంచి, హెచ్‌-1బీ వీసాదారులు, వారి డిపెండెంట్స్‌కు డిసెంబరు, 2025 నుంచి ఈ నిబంధన అమలులో ఉంది. తాజాగా దీనిని మరిన్ని కేటగిరీలకు విస్తరిస్తూ ట్రంప్‌ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది.

Updated Date - Mar 30 , 2026 | 04:29 AM