U.S. Special Forces: నైట్ స్టాకర్స్ తోడుగా..డెల్టా ఫోర్స్ ముందుండి!
ABN , Publish Date - Jan 05 , 2026 | 02:33 AM
నాలుగు నెలల ప్రణాళిక.. ఒకటికి పది సార్లు పక్కాగా నిఘా.. సమయం చిక్కగానే రంగంలోకి అత్యున్నత దళమైన డెల్టాఫోర్స్.. దానికితోడుగా శత్రువులకు ఏమాత్రం చిక్కకుండా రాత్రివేళల్లో అత్యంత సమర్థవంతంగా దాడులు చేసే నైట్ స్టాకర్స్ వైమానిక.....
అమెరికా అత్యున్నత దళాలతో వెనెజువెలాలో ఆపరేషన్
వాషింగ్టన్, జనవరి 4: నాలుగు నెలల ప్రణాళిక.. ఒకటికి పది సార్లు పక్కాగా నిఘా.. సమయం చిక్కగానే రంగంలోకి అత్యున్నత దళమైన డెల్టాఫోర్స్.. దానికితోడుగా శత్రువులకు ఏమాత్రం చిక్కకుండా రాత్రివేళల్లో అత్యంత సమర్థవంతంగా దాడులు చేసే నైట్ స్టాకర్స్ వైమానిక దళం.. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకెళ్లేందుకు అమెరికా అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన తీరు ఇది. అధ్యక్ష భవనంలోకి చొరబడిన తర్వాత కేవలం 5నిమిషాల్లోనే మదురోను, ఆయన భార్యను అమెరికన్ దళాలు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అమెరికా నావికాదళం, నైట్ స్టాకర్స్ వైమానిక దళం, డెల్టాఫోర్స్ పదాతిదళం మూడూ పూర్తి సమన్వయంతో అత్యంత విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేశాయి. ఆపరేషన్‌లో భాగంగా.. డ్రగ్స్ ముఠాను అరికట్టడానికంటూ అమెరికా కరీబియన్ సముద్రంలో వెనెజువెలాకు దగ్గరగా యుద్ధ నౌకలను, దళాలను మోహరించింది. నిజానికి మదురోను అరెస్టు చేయడం కోసం వెనెజువెలా తీరానికి దగ్గరగా అమెరికా చేసుకున్న ఏర్పాట్లు అవి. ఆ యుద్ధ నౌకల నుంచి నిఘాకు దొరకని స్టెల్త్ డ్రోన్లను వెనెజువెలా రాజధాని కారక్‌సపైకి పంపి.. మదురో ఉండే అధ్యక్ష భవనం, సమీప ప్రాంతాలు, ఆయన కదలికలపై అమెరికా నిఘా పెట్టింది. అమెరికా నిఘా సంస్థ సీఐఏ గూఢచారులను కూడా వెనెజువెలాలోకి పంపింది. మదురో కదలికల వివరాలు తెలిసిన వెనెజువెలా అధికారులు, నేతలకు గూఢచారులు ఎరవేసి సమాచారం సేకరించారు. ఇలా ఆగస్టు నుంచి సుమారు 4నెలలపాటు వివరాలన్నీ సేకరించి.. పక్కాగా ప్రణాళిక రూపొందించారు. అమెరికాలోని కెంటకీలో అచ్చం మదురో ఉండే భవనం తరహా నమూనాను సృష్టించారు. ఎక్కడి నుంచి ప్రవేశించి, ఎలా ముందుకెళ్లాలి, మదురోను పట్టుకొన్నాక ఎలా బయటికి రావాలి, ఎలా తరలించాలనేది ప్రాక్టీసు చేశారు.
ట్రంప్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే..
మదురోను పట్టుకుని, తీసుకెళ్లేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి శుక్రవారం రాత్రి 10.46కు (స్థానిక కాలమానం ప్రకారం) గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. రాగానే రక్షణశాఖ ఉన్నతాధికారులు ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్’ ప్రారంభించారు. అత్యున్నత సైనిక దళం ‘డెల్టా ఫోర్స్’ను, దానికి సహాయకంగా నైట్ స్టాకర్స్‌ను రంగంలోకి దింపారు. 20 యుద్ధ నౌకల నుంచి సుమారు 150 ఫైటర్లు, బాంబర్లు, నిఘా విమానాలు వెనెజువెలా గగనతలంలోకి ప్రవేశించాయి. కారక్‌సలో క్షిపణి, యుద్ధ విమాన రక్షక వ్యవస్థలను, విద్యుత్ వ్యవస్థలను ధ్వంసం చేశాయి. ఆ వెంటనే నైట్ స్టాకర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎంహెచ్-60, ఎంహెచ్-47 హెలికాప్టర్లలో డెల్టా ఫోర్స్ కమెండోలు బయలుదేరారు. ఫోర్ట్ ట్యూనా మిలటరీ కాంప్లెక్స్‌లోని వెనెజువెలా అధ్యక్షభవనంపై అర్ధరాత్రి 1.01 గంటల సమయంలో దిగారు.
స్టీలు గదిలో దాక్కోబోయినా..
అమెరికా ఎప్పుడైనా దాడి చేయవచ్చన్న ఉద్దేశంతో తాను దాక్కోవడానికి అధ్యక్ష భవనంలో మదురో అత్యంత దృఢమైన ఉక్కు గదిని ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం రాత్రి అమెరికా దళాలు అధ్యక్ష భవనంలోకి ప్రవేశించగానే.. ఉక్కు గదిలోకి వెళ్లేందుకు మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ ప్రయత్నించారు. కానీ డెల్టాఫోర్స్ సైనికులు ఒకట్రెండు నిమిషాల్లోనే మదురో గదికి చేరుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత హెలికాప్టర్‌లో అమెరికా యుద్ధ నౌక యూఎ్‌సఎస్ ఇవో జిమాకు తరలించారు. ట్రంప్ గ్రీన్‌సిగ్నల్ నుంచి మదురోను అమెరికా యుద్ధనౌకపైకి చేర్చే వరకు ఆపరేషన్ మొత్తం 2 గంటల 20 నిమిషాల్లోనే ముగిసింది. అందులో మదురోను అదుపులోకి తీసుకునే ప్రధాన ఆపరేషన్ అరగంటలోనే ముగిసింది.
ఏమిటీ డెల్టా ఫోర్స్.. నైట్ స్టాకర్స్?
ఉగ్రవాదంపై పోరు, అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించడం కోసం అమెరికా 1977లోనే ప్రత్యేకంగా ‘డెల్టా ఫోర్స్’ సైనిక దళాన్ని ఏర్పాటు చేసింది. మిగతా సైనికదళాల్లో అత్యంత సామర్థ్యం చూపిన వారిని దీనికి ఎంపిక చేసి... చాలా క్లిష్టమైన శిక్షణ ఇస్తారు. లాడెన్ వేట కోసం అఫ్ఘానిస్థాన్, ఇరాక్, సిరియాలలో చేసిన క్లిష్టమైన ఆపరేషన్లలో డెల్టా ఫోర్స్ దళాలు కీలకంగా వ్యవహరించాయి. ఇక ప్రత్యేక పరికరాల సాయంతో రాత్రివేళల్లో తక్కువ ఎత్తు నుంచి, అత్యంత కచ్చితంగా దాడి చేయగలిగే సామర్థ్యం నైట్ స్టాకర్స్ సొంతం.