Share News

భారతీయులున్న చమురు నౌకపై దాడి మా పనే

ABN , Publish Date - Jun 10 , 2026 | 03:57 AM

ఒమాన్‌ దేశ తీరంలో 24మంది భారతీయులతో వెళ్తున్న చమురు నౌక ఎంటీ మారివెక్స్‌పై దాడి చేసింది తామేనని అమెరికా వెల్లడించింది.

భారతీయులున్న చమురు నౌకపై దాడి మా పనే

  • నౌక ఇరాన్‌ వెళ్తోందని దాడి: అమెరికా సెంట్రల్‌ కమాండ్‌

న్యూఢిల్లీ, జూన్‌ 9: ఒమాన్‌ దేశ తీరంలో 24మంది భారతీయులతో వెళ్తున్న చమురు నౌక ఎంటీ మారివెక్స్‌పై దాడి చేసింది తామేనని అమెరికా వెల్లడించింది. ఆ నౌకలోని సిబ్బంది తమ ఆదేశాలను పట్టించుకోకుండా, హోర్ముజ్‌ దిగ్బంధనాన్ని దాటుకొని ఇరాన్‌ పోర్టు వైపు నౌకను తీసుకువెళ్లడానికి ప్రయత్నించారని తెలిపింది. అందుకే దాడి చేశామని వివరించింది. అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎ్‌సఎస్‌ అబ్రహం లింకన్‌ యుద్ధ నౌక నుంచి ఈ దాడి చేసినట్లు పేర్కొంది. ఎంటీ మారివెక్స్‌ నౌక ఇక ఇరాన్‌కు వెళ్లబోదని తెలిపింది. కాగా, ఈ దాడిలో నౌకలోని సిబ్బందికి ఏమీ కాలేదు. దాడి జరిగిన వెంటనే మంటలను గుర్తించిన సిబ్బంది తమను కాపాడాలంటూ ఒమాన్‌, భారత అధికారులకు అత్యవసర సమాచారం ఇచ్చారు. ఒమాన్‌ అధికారుల సాయంతో భారత నౌకాదళానికి చెందిన హెలికాప్టర్లతో సిబ్బందిని నౌక నుంచి సురక్షితంగా తీసుకువచ్చారు.

Updated Date - Jun 10 , 2026 | 03:57 AM