గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు అమెరికాలోనే ఉండొచ్చు
ABN , Publish Date - May 31 , 2026 | 04:50 AM
గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారు అది ఆమోదం పొందేవరకూ తమ స్వదేశానికి వెళ్లిపోవాలన్న నిబంధనపై అమెరికా వెనక్కి తగ్గింది...
స్వరం మార్చిన డీహెచ్‌ఎస్.. పది రోజుల్లోపే నిర్ణయంపై వెనక్కి
న్యూఢిల్లీ, మే 30: గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారు అది ఆమోదం పొందేవరకూ తమ స్వదేశానికి వెళ్లిపోవాలన్న నిబంధనపై అమెరికా వెనక్కి తగ్గింది. ఈ నిబంధన కొందరికి మాత్రమే వర్తిస్తుందని, ఇంతకుముందు చేసిన ప్రకటనలో పెద్దగా మార్పు ఏమీ లేదని తెలిపింది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం శాశ్వత నివాసం కోసం చేసిన దరఖాస్తుల ఆమోదం కోసం వలసదారులు అమెరికాలోనే ఉండొచ్చని స్పష్టం చేసింది. ఈ అంశంపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) ప్రతినిధి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గ్రీన్‌కార్డు ప్రక్రియను పూర్తిచేయడానికి దరఖాస్తుదారులను వారి స్వదేశానికి పంపాలా, వద్దా అనే విషయాన్ని ఇమిగ్రేషన్ అధికారులే నిర్ణయిస్తారని తెలిపారు. వాస్తవానికి అటువంటి విచక్షణాధికారం ఎప్పటినుంచో అమలులో ఉందన్నారు. దాన్ని అధికారులకు మరోసారి గుర్తుచేయడమే మే 21న ఇచ్చిన మార్గదర్శకాల వెనుక ఉద్దేశమని వివరించారు.