అప్పర్ భద్రపై కీలక ముందడుగు!
ABN , Publish Date - Sep 25 , 2026 | 06:33 AM
కృష్ణా జలాల వివాదాల టైబ్ర్యునల్ (కేటీడబ్ల్యూ) అవార్డు పరిధిలో లేని కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీంకోర్టులో దాఖలైన కీలక కేసులో విచారణాంశాలు ఖరారయ్యాయి.
సుప్రీం విచారణకు 7 ప్రధానాంశాలు ఖరారు
ఆంధ్ర, కర్ణాటక ఉమ్మడి ముసాయిదా పరిగణనలోకి
సాక్ష్యాధారాలు, అఫిడవిట్ల సమర్పణకు ఎనిమిది వారాల గడువు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల వివాదాల టైబ్ర్యునల్ (కేటీడబ్ల్యూ) అవార్డు పరిధిలో లేని కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీంకోర్టులో దాఖలైన కీలక కేసులో విచారణాంశాలు ఖరారయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన ఒరిజినల్ సూట్‌లో ప్రధానంగా ఏడు అంశాలపై విచారణ జరపాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు ఉమ్మడిగా సమర్పించిన ముసాయిదా ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంది. విచారణాంశాలు ఖరారైన నేపథ్యంలో తదుపరి న్యాయ ప్రక్రియపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వాద ప్రతివాదులంతా సంబంధిత సాక్ష్యాధారాలను, డాక్యుమెంట్లను, అఫిడవిట్లను ఎనిమిది వారాల్లోగా న్యాయస్థానానికి సమర్పించాలని ఆదేశించింది. పత్రాల మార్పిడి ప్రక్రియను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదావేసింది.
ఇదీ కేసు..: కృష్ణా ట్రైబ్యునల్ కేటాయింపులు, అవార్డు పరిధిని దాటి కర్ణాటక ప్రభుత్వం అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోందని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం 2023లో సుప్రీంకోర్టులో ఒరిజినల్ సూట్ దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలు సమగ్రంగా వినేందుకు తొలుత విచారణాంశాలను ఖరారు చేయాలని నిరుడు డిసెంబరులో కోర్టు సూచించింది. దీంతో ఏపీ, కర్ణాటక రాష్ట్రాల న్యాయవాదులు చర్చించుకుని 7అంశాలతో ముసాయిదా సిద్ధం చేశారు. దానిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. గురువారం త్రిసభ్య ధర్మాసనం విచారణ సందర్భంగా తెలంగాణ తరఫున న్యాయవాది హాజరై.. విచారణాంశాల్లో కొత్తగా ఒక అంశాన్ని చేర్చాలని కోరారు. దీనిపై ఏపీ, కర్ణాటక తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ధర్మాసనం తెలంగాణ వినతిని తిరస్కరించింది. అభ్యంతరాలు ఉంటే విడిగా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.