Share News

యూపీఐపై చార్జీలు!

ABN , Publish Date - Sep 16 , 2026 | 05:46 AM

దేశవ్యాప్తంగా యూపీఐ (ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ)పై చార్జీల బాదుడుకు రంగం సిద్ధమైంది. యూపీఐ ద్వారా చేసే రూ.2 వేలకు మించిన వాణిజ్య లావాదేవీలపై 0.4 ఎండీఆర్‌ (మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌-వ్యాపారుల నుంచి వసూలు చేసే) చార్జీలు విధిస్తున్నట్టు..

యూపీఐపై చార్జీలు!
UPI Charges

  • వాణిజ్య లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ వసూలు

  • రూ.2 వేల వరకు లావాదేవీలపై మినహాయింపు.. రూ.5 వేలపై రూ.20.. రూ.10 వేలకు రూ.40 చార్జీ

  • ఒక లావాదేవీపై గరిష్ఠంగా రూ.300.. విద్యుత్‌, టెలికం, బీమా, ఇంధన రంగాలకు చెల్లింపులపై ఒక్కో లావాదేవీకి రూ.5

  • మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌బ్రోకర్లకు చేసే చెల్లింపులపై 0.02శాతం ఎండీఆర్‌.. వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి..

  • వ్యాపారుల నుంచి ఎండీఆర్‌ రూపంలో వసూలు.. వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలకు ఎలాంటి చార్జీలు ఉండవు

  • చెల్లింపుల వ్యవస్థల చట్టం-2007కు చేసిన సవరణలపై నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: దేశవ్యాప్తంగా యూపీఐ (ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ)పై చార్జీల బాదుడుకు రంగం సిద్ధమైంది. యూపీఐ ద్వారా చేసే రూ.2 వేలకు మించిన వాణిజ్య లావాదేవీలపై 0.4 ఎండీఆర్‌ (మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌-వ్యాపారుల నుంచి వసూలు చేసే) చార్జీలు విధిస్తున్నట్టు ఎన్‌పీసీఐ (జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌) మంగళవారం ప్రకటించింది. అంటే చెల్లించే మొత్తం రూ.2 వేలు దాటితే.. మొదటి నుంచీ కూడా చార్జీ వర్తిస్తుంది. ఉదాహరణకు రూ.3 వేలకు రూ.12.. రూ.5 వేలకు రూ.20.. రూ.10 వేలకు రూ.40 చార్జీ పడుతుంది. అయితే వ్యక్తుల మధ్య యూపీఐ చెల్లింపులపై ఎలాంటి చార్జీలు ఉండబోవని.. కేవలం వాణిజ్య లావాదేవీలకు మాత్రమే ఈ చార్జీలు వర్తిస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. క్రెడిట్‌, డెబిట్‌కార్డులు, వ్యాలెట్లతో పోలిస్తే.. వాణిజ్య యూపీఐపై చార్జీలు చాలా తక్కువ అని పేర్కొంది. ఈ చార్జీల సొమ్మును బ్యాంకులు, చెల్లింపుల వ్యవస్థలలోని ఇతర భాగస్వాములకు పంచుతారని తెలిపింది. యూపీఐ యాప్‌ ప్రొవైడర్లు యూపీఐ లావాదేవీలపై ఎలాంటి నిర్వహణ, నిగూఢ చార్జీలు విధించవద్దని ఆదేశించింది. వ్యాపారులు యూపీఐ ఎండీఆర్‌ చార్జీల భారాన్ని వినియోగదారులపై వేయకుండా చూడాలని బ్యాంకులకు సూచించింది. వాణిజ్య యూపీఐ లావాదేవీలపై 0.4శాతం చొప్పున వసూలు చేసినా, గరిష్ఠంగా రూ.300 చార్జీ విధించింది.


అంటే రూ.75వేలకుపైన ఎంత మొత్తం చెల్లించినా.. రూ.300 మాత్రమే ఎండీఆర్‌ చార్జీల కింద తీసుకుంటారు. ఇక రైల్వే, టెలికం, బీమా, ఇంధనం, వ్యవసాయ చెల్లింపులు, విద్యుత్‌, నీటి బిల్లులు, పైప్డ్‌ గ్యాస్‌ బిల్లులు వంటి కీలక రంగాలకు రూ.2వేలకు మించి చేసే చెల్లింపులకు ఒక్కో లావాదేవీపై రూ.5 చొప్పున చార్జీ వసూలు చేస్తారు. మ్యూచువల్‌ ఫండ్స్‌, షేర్ల కొనుగోళ్లు, స్టాక్‌ బ్రోకర్లకు చేసే యూపీఐ చెల్లింపులపై 0.02 శాతం (గరిష్ఠంగా రూ.300) ఎండీఆర్‌ చార్జీలు విధించారు. అంటే సుమారు రూ.లక్షకు రూ.20 చార్జీ పడుతుంది. యూపీఐ ద్వారా నెలకు రూ.లక్ష లోపు చెల్లింపులు స్వీకరించే చిన్నవ్యాపారులకు ఎండీఆర్‌ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. తద్వారా కేవలం 4శాతం వ్యాపార లావాదేవీలపైనే ఎండీఆర్‌ చార్జీల ప్రభావం పడుతుందని పేర్కొంది. చిన్న వ్యాపారులు యూపీఐ వినియోగించడాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని, యూపీఐ ఎండీఆర్‌ చార్జీల రూపంలో వసూలయ్యే సొమ్ములో 5శాతం ఆ నిధికి కేటాయిస్తామని వెల్లడించింది. ఎండీఆర్‌ చార్జీలు, పరిమితుల విధానం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.


చెల్లింపుల చట్టసవరణపై నోటిఫికేషన్‌..

కేంద్రం యూపీఐ చెల్లింపులపై చార్జీలు లేకుండా 2020 జనవరిలో జాతీయ చెల్లింపుల చట్టం-2007కు సవరణ చేసి సెక్షన్‌ 10ఏను చేర్చింది. యూపీఐ, రూపేకార్డు ద్వారా చేసే లావాదేవీలపై ఎండీఆర్‌ సహా ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష చార్జీలు విధించకూడదని పేర్కొంది. తాజా పార్లమెంటు సమావేశాల్లో ఆ చట్టాన్ని తిరిగి సవరించి, సెక్షన్‌ 10ఏకు మార్పులు చేసింది. చార్జీల మినహాయింపును రూ.2 వేలలోపు వాణిజ్య యూపీఐ, రూపేకార్డు లావాదేవీలకే పరిమితం చేసింది. అంటే రూ.2వేలు దాటితే చార్జీలు విధించేందుకు మార్గం తెరిచింది. అయితే వ్యక్తుల మధ్య యూపీఐ లావాదేవీలపై చార్జీల మినహాయింపును మాత్రం కొనసాగించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సోమవారమే గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దానికి అనుగుణంగా వాణిజ్య యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ విధిస్తున్నట్టు ఎన్‌పీసీఐ మంగళవారం ప్రకటించింది.

ఏమిటీ ఎండీఆర్‌ చార్జీలు.. ఎవరు కట్టాలి?

వ్యాపారులు వివిధ మార్గాల ద్వారా స్వీకరించే చెల్లింపులపై బ్యాంకులకు చెల్లించాల్సిన చార్జీలనే.. ఎండీఆర్‌ (మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌)గా పిలుస్తారు. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, ఆన్‌లైన్‌లో నగదు బదిలీ వంటి వాటిపై ఇప్పటికే వివిధ స్థాయిల్లో ఎండీఆర్‌ చార్జీలు ఉన్నాయి. తాజాగా యూపీఐపైనా ఎండీఆర్‌ చార్జీలు విధించారు. సాంకేతికంగా వ్యాపారుల నుంచే ఈ చార్జీలు వసూలు చేస్తారు. అంటే వినియోగదారుడు ఏదైనా వస్తువు కొని రూ.5,000 చెల్లిస్తే.. బ్యాంకులు ఎండీఆర్‌ చార్జీలు రూ.20 మినహాయించుకుని, మిగతా సొమ్మును వ్యాపారి ఖాతాలో జమచేస్తాయి. సాంకేతికంగా వ్యాపారుల నుంచే వసూలు చేస్తున్నా.. వ్యాపారులు ఆ భారాన్ని వినియోగదారులపైనే వేసే అవకాశాలు ఎక్కువ. ఇప్పటికే క్రెడిట్‌, డెబిట్‌కార్డులతో చెల్లింపుల కోసం వ్యాపారులు వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేస్తుండటం తెలిసిందే.


బ్యాంకులు, చెల్లింపుల సంస్థల ఒత్తిళ్లతో..

వినియోగదారులు క్రెడిట్‌, డెబిట్‌కార్డులు, యూపీఐతో చెల్లింపులు చేసినప్పుడు.. సొమ్ము వినియోగదారు బ్యాంకు నుంచి చెల్లింపుల వ్యవస్థల ద్వారా వ్యాపారి బ్యాంకు ఖాతాలోకి చేరుతుంది. ఇలా లావాదేవీల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని ఎండీఆర్‌ చార్జీల రూపంలో వసూలు చేస్తారు. వీసా, మాస్టర్‌కార్డ్‌ వంటి సంస్థలు చెల్లింపుల గేట్‌వేలుగా ఉన్నాయి. ఎండీఆర్‌ చార్జీలలో ఇటు బ్యాంకులతోపాటు అటు చెల్లింపుల సంస్థలకు నిర్ణీత శాతం వెళుతుంది. అయితే భారత్‌లో యూపీఐని ప్రవేశపెట్టడం, లావాదేవీలన్నీ ఉచితం చేయడంతో.. చెల్లింపుల గేట్‌వేలకు, బ్యాంకుల ఆదాయానికి గండిపడింది. యూపీఐ లావాదేవీల నిర్వహణ భారంగా మారిందని, చార్జీలు విధించాలని బ్యాంకులు, గూగుల్‌పే, ఫోన్‌పే వంటి యూపీఐ యాప్‌ సంస్థలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఈ క్రమంలోనే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. యూపీఐ నిర్వహణ, సర్వర్లు, ఇతర మౌలిక వసతులు, సైబర్‌ సెక్యూరిటీ, బ్యాంకుల సాంకేతిక మద్దతు కోసం ఏటా రూ.20 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - Sep 16 , 2026 | 06:46 AM