5 రోజుల్లో నలుగురు బిడ్డలు!
ABN , Publish Date - May 16 , 2026 | 03:55 AM
ఒకే కాన్పులో నలుగురు శిశువులు పుట్టడం అరుదు. మరి.. ఆ శిశువులే నిమిషాల వ్యవధిలో కాకుండా రోజుల వ్యవధిలో పుడితే? అరుదైన ఘటనల్లోకెల్లా అరుదైన ఈ ఘటన యూపీలో జరిగింది.
అదీ సిజేరియన్ లేకుండా సాధారణ ప్రసవం
మొరాదాబాద్, మే 15: ఒకే కాన్పులో నలుగురు శిశువులు పుట్టడం అరుదు. మరి.. ఆ శిశువులే నిమిషాల వ్యవధిలో కాకుండా రోజుల వ్యవధిలో పుడితే? అరుదైన ఘటనల్లోకెల్లా అరుదైన ఈ ఘటన యూపీలో జరిగింది. మొదటి బిడ్డ పుట్టి.. పూర్తిగా నాలుగు రోజులు గడిచిన తర్వాత మరో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చిందో గర్భిణి! ఇలా ఐదురోజుల వ్యవధిలో ఇద్దరు ఆడ, మరో ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చిందామె! వైద్య వర్గాలనే సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే అత్యంత అరుదైన ఈ ఘటనకు వేదికైంది లోధిపూర్‌లోని తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ ఆస్పత్రి. పైగా వైద్యులు ‘హై రిస్క్’గా పరిగణించిన ఈ కేసులో నలుగురు బిడ్డలకూ ఆ మహిళ సిజేరియన్ ద్వారా కాకుండా సాధారణ కాన్పు ద్వారా జన్మనివ్వడం మరో విశేషం. యూపీ సంభాల్ జిల్లాలోని ఓవరీ గ్రామానికి చెందిన అమీనా గర్భం దాల్చాక పరీక్షల కోసం ఆ ఆస్పత్రికి వెళ్లింది. స్కానింగ్ చేసిన వైద్యులు, ఆమె గర్భంలో నాలుగు పిండాలు ఉన్నట్లు నిర్ధారించారు. నలుగురు బిడ్డలకు జన్మనిస్తే ఆమె ప్రాణాలకు ప్రమాదం అని, గర్భస్థ శిశువులను తగ్గించుకోవాలని సూచించారు. ఇందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. ఎలా జరిగితే అలా జరుగుతుందని, అమీనా నలుగురు బిడ్డలనూ కడుపులో మోస్తుందని చెప్పారు. దీంతో.. అప్పటి నుంచి ప్రసవం జరిగేదాకా ఆరునెలల పాటు ప్రత్యేక వైద్య బృందం ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షించింది. నెలలు నిండాక.. ఈనెల 9న మొదటి శిశువుకు జన్మనిచ్చిన అమీనా, 14న మిగతా ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. బిడ్డలను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఓ గర్భిణి నలుగురు బిడ్డలకు ఐదురోజుల్లో జన్మనివ్వడం తమ ఆస్పత్రిలో ఇదే తొలిసారి అని గైనకాలజిస్ట్ శుభ్ర అగర్వాల్ చెప్పారు.