Share News

నోయిడా కార్మికుల వేతనాల పెంపు

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:02 AM

కనీస వేతనాలను పెంచాలని నోయిడాలో కార్మికుల ఆందోళన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం స్పందించింది. విభాగాల వారీగా కనీస వేతనాలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

నోయిడా కార్మికుల వేతనాల పెంపు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 14: కనీస వేతనాలను పెంచాలని నోయిడాలో కార్మికుల ఆందోళన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం స్పందించింది. విభాగాల వారీగా కనీస వేతనాలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. నైపుణ్యంలేని కార్మికుల వేతనాన్ని నెలకు రూ. 11,313 నుంచి రూ.13,690కు, అలాగే సెమీ స్కిల్డ్‌, స్కిల్డ్‌ వర్కర్ల వేతనాన్ని వరుసగా రూ. 15,059, రూ. 16,868కి పెంచింది. గౌతమ్‌ బుద్ధ నగర్‌, ఘజియాబాద్‌లో ఏప్రిల్‌ 1 నుంచి ఈ పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇతర మున్సిపల్‌ కార్పోరేషన్లలో నైపుణ్యంలేని, సెమీ స్కిల్డ్‌, స్కిల్డ్‌ కార్మికులు వరుసగా రూ.13,006, రూ.14,306, రూ.16,025 వేతనంగా పొందుతారు. మిగిలిన జిల్లాల్లో కూడా పెంచిన వేతనాలు అమలవుతాయి. ఈ పెంపును హైపర్‌ కమిటీ ఆమోదించిందని, సీఎం కూడా ఆమోదం తెలిపారని గౌతమ్‌ బుద్ధ నగర్‌ కలెక్టర్‌ మేధా రూపమ్‌ చెప్పారు. కాగా, కార్మికుల ఆందోళన వెనుక పాక్‌ కుట్ర ఉండవచ్చని యూపీ కార్మిక మంత్రి అనిల్‌ రాజ్‌భర్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల పాక్‌తో సంబంధాలున్నాయని మీరట్‌, నోయిడాల్లో ఉగ్రవాదులను అరెస్టు చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. ముందస్తు వ్యూహం ప్రకారమే నోయిడాలో కార్మికుల ఆందోళన జరిగిందని పోలీసులు మంగళవారం వెల్లడించారు. తెరవెనుక నుంచి కొందరు హింసాకాండను ప్రేరేపించారని చెప్పారు. కార్మికులను రెచ్చగొట్టిన వారికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. కాగా, నోయిడా కార్మికుల హింసాత్మక ఆందోళనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు సుమారు 400 మందిని అరెస్టు చేశారు.

Updated Date - Apr 15 , 2026 | 04:02 AM