రోడ్లపై నమాజ్‌లు చేయొద్దు!
ABN , Publish Date - May 19 , 2026 | 04:10 AM
రోడ్లపై నమాజ్‌లు చేయొద్దని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముస్లింలను హెచ్చరించారు. మతపరమైన ప్రార్థనలు నిర్దేశిత ప్రాంతాల్లోనే చేసుకోవాలని స్పష్టం చేశారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టీకరణ
లఖ్‌నవూ, మే 18: రోడ్లపై నమాజ్‌లు చేయొద్దని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముస్లింలను హెచ్చరించారు. మతపరమైన ప్రార్థనలు నిర్దేశిత ప్రాంతాల్లోనే చేసుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రహదారులపై నమాజ్ చేసి, ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించడాన్ని తమ ప్రభుత్వం అనుమతించబోదని చెప్పారు. ‘‘రోడ్లు ఉన్నది నడవడానికి, వాహనాలు తిరగడానికే తప్ప తమాషా చేయడానికి కాదు. ఒక రోడ్డును బ్లాక్ చేయడానికి ఎవరికైనా ఏం హక్కు ఉంది? వాళ్లను వెళ్లి వారి ప్రార్థనా మందిరాల్లో నమాజ్‌లు చేసుకోమనండి’’ అని యోగి అన్నారు. ఈ నెల 28న ముస్లింలు బక్రీద్ పండగ చేసుకోనున్న తరుణంలో సీఎం యోగి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవేళ స్థలాలు సరిపోకపోతే షిఫ్టుల వారీగా నమాజ్ చేసుకోవాలని యోగి సూచించారు. ‘‘మీ ఇళ్లలో నమాజ్‌లు చేసుకోవడానికి స్థలం సరిపోకపోతే, జనాభాను తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టండి. ఈ వ్యవస్థలో కలిసి జీవించాలని భావిస్తే మీరు కచ్చితంగా చట్టాలు, నిబంధనలను పాటించాల్సిందే. చట్టం అందరికీ సమానమే. నమాజ్ చేయడం తప్పనిసరి అయితే షిఫ్టుల వారీగా చేసుకోండి. ప్రార్థన చేసుకోకుండా మిమ్మల్ని అడ్డుకోం. కానీ, వీధుల్లో, రోడ్లపై చేస్తామంటే మాత్రం అనుమతించే ప్రసక్తే లేదు’’ అని యోగి స్పష్టం చేశారు. ఇకపై రోడ్లపై ఇలాంటి అంతరాయాలు కలిగిస్తే తమ ప్రభుత్వం సహించబోదన్నారు. శాంతియుతంగా ఉంటే మంచిదని, లేదంటే తమ పద్ధతిలో తాము చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని యోగి అన్నారు.