Share News

Maharashtra politics: మహారాష్ట్రలో బీజేపీ-కాంగ్రెస్‌-ఎంఐఎం జట్టు

ABN , Publish Date - Jan 08 , 2026 | 03:09 AM

మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిలో అవకాశవాద పొత్తుల చిచ్చు రాజుకుంది. మున్సిపల్‌ కౌన్సిళ్లను కైవసం చేసుకునేందుకు బీజేపీ-కాంగ్రెస్‌-ఎంఐఎం చేతులు కలిపాయి.

Maharashtra politics: మహారాష్ట్రలో బీజేపీ-కాంగ్రెస్‌-ఎంఐఎం జట్టు

ముంబై, జనవరి 7: మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిలో అవకాశవాద పొత్తుల చిచ్చు రాజుకుంది. మున్సిపల్‌ కౌన్సిళ్లను కైవసం చేసుకునేందుకు బీజేపీ-కాంగ్రెస్‌-ఎంఐఎం చేతులు కలిపాయి. థానే జిల్లా అంబర్‌నాథ్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ను దక్కించుకునేందుకు బీజేపీ-కాంగ్రెస్‌ జట్టు కట్టాయి. 27మంది కౌన్సిలర్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన శిందే సేనకు అధికారం దక్కకుండా చేసేందుకు బీజేపీ-కాంగ్రెస్‌-ఎన్సీపీ అంబర్‌నాథ్‌ వికాస్‌ అఘాడీ పేరిట కూటమిగా ఏర్పడ్డాయి. 60 స్థానాలున్న కౌన్సిల్‌లో మేయర్‌ పీఠం దక్కించుకోవడానికి 31మంది కౌన్సిలర్లు అవసరం కాగా బీజేపీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు, 12 మంది కాంగ్రెస్‌, ఎన్సీపీకి చెందిన నలుగురు, ఇద్దరు ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లు కలిపి మొత్తం 32 మంది కూటమిలో చేరారు. దీంతో బీజేపీకి చెందిన తేజశ్రీ కరన్‌జులే అంబర్‌నాథ్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అంటూ పిలుపునిచ్చిన కమలనాథులు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం తమను వెన్నుపోటు పొడవమేనని, అధికారం కోసం ఎంతకైనా దిగజారడం సరికాదని శిందే సేన నేతలు ఆరోపించారు. అయితే తాము పొత్తు కోసం యత్నించినా శిందే సేన ముందుకు రాలేదని స్థానిక బీజేపీ నేతలు స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీకి మద్దతిచ్చిన 12 మంది కౌన్సిలర్లను కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.


ఎంఐఎం మద్దతుతో అకోట్‌ కౌన్సిల్‌ కైవసం

35 స్థానాలున్న అకోట్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌లో బీజేపీ తరపున 11 మంది కౌన్సిలర్లు నెగ్గారు. దీంతో ఉద్ధవ్‌ థాకరే యూబీటీ, శిందే సేన, అజిత్‌ పవార్‌ ఎన్సీపీ, శరద్‌ పవార్‌ ఎన్సీపీలకు చెందిన కౌన్సిలర్లతో పాటు ఏఐఎంఐఎంకు చెందిన నలుగురు కౌన్సిలర్లతో కలిపి కమలనాథులు అకోట్‌ వికాస్‌ మంచ్‌గా కూటమి ఏర్పాటు చేశారు. మొత్తం 25 మంది కౌన్సిలర్ల మద్దతుతో బీజేపీకి చెందిన మాయా ధులే మేయర్‌గా ఎన్నికయ్యారు. మరోవైపు కాంగ్రెస్‌, ఎంఐఎంలతో స్థానిక నేతలు పొత్తులు పెట్టుకోవడాన్ని మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ తప్పుబట్టారు. సదరు నేతలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆయన పొత్తులు వదులుకోవాలని సూచించారు.

Updated Date - Jan 08 , 2026 | 03:09 AM