Share News

కేంద్రమంత్రి మురుగన్ రాజీనామా

ABN , Publish Date - Oct 14 , 2026 | 04:58 AM

కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి డాక్టర్‌ ఎల్‌.మురుగన్‌ మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు

కేంద్రమంత్రి మురుగన్ రాజీనామా
mrugan

  • మంత్రి పదవితోపాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా.. బాధ్యతల నుంచి విముక్తం చేయాలంటూ ప్రధానికి లేఖ

  • పార్టీకి పూర్తి సమయం కేటాయించేందుకేనని వివరణ

  • తమిళనాట బీజేపీ బలోపేతానికి పనిచేస్తానని ప్రకటన

చెన్నై, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి డాక్టర్‌ ఎల్‌.మురుగన్‌ మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంగళవారం ఈ మేరకు ఆయన లేఖను పంపించారు. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో బీజేపీని బలోపేతం చేసేందుకు తాను తిరిగి క్షేత్రస్థాయికి వెళ్లి, పూర్తి సమయాన్ని కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. తక్షణమే తనను ఆయా బాధ్యతల నుంచి విముక్తం చేయాలని అభ్యర్థించారు. తన రాజీనామా గురించి ‘ఎక్స్‌’లోనూ ఆయన ప్రకటించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారతమాతకు, తమిళనాడుకు సేవ చేయడం తన జీవితంలో అత్యంత గొప్ప విషయమని పేర్కొన్నారు. రోజువారీ కూలీల కుమారుడిగా మొదలై, కేంద్రమంత్రివర్గంలో పనిచేసే స్థాయికి చేరడం తన అదృష్టమన్నారు. ‘దేశం ప్రథమం, ఆ తర్వాత పార్టీ, చివరన స్వప్రయోజనం’ అని తెలిపారు.


ఎవరీ మురుగన్‌?

తమిళనాడులోని నామక్కల్‌ జిల్లా కొనూరులో జన్మించిన డాక్టర్‌ లోగనాధన్‌ మురుగన్‌ తెలుగు మాట్లాడే అరుంధతియార్‌ సామాజిక వర్గానికి చెందినవారు. 1977లో జన్మించిన ఆయన.. చెన్నైలోని డాక్టర్‌ అంబేడ్కర్‌ లా కళాశాల నుంచి డిగ్రీ, మద్రాస్‌ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ పొందారు. ఆ సమయంలో ఏబీవీపీలో చేరి తర్వాత ఆర్‌ఎ్‌సఎస్‌ వైపు ఆకర్షితులయ్యారు. అనంతరం బీజేపీలో చేరి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో రాశిపురం నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి 1800 ఓట్లు మాత్రమే సంపాదించుకోగలిగారు. ఆ తర్వాత బీజేపీలో వివిధ హోదాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి 2020లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తారాపురం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే, అధ్యక్షుడిగా కిందిస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో ఆయన సఫలీకృతమయ్యారు. దీనిని గుర్తించిన పార్టీ అధిష్ఠానం ఆయన్ని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంది. తమ పార్టీ తరఫున గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలను అధిష్ఠానానికి పరిచయం చేసేందుకు 2021 జూలై 7వ తేదీన ఢిల్లీకి తీసుకెళ్లిన ఆయనకు కేంద్రమంత్రి పదవి ఇచ్చి సత్కరించింది. అలాగే మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు పంపించింది. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీకాలం 2030 వరకు ఉంది. త్వరలో కేంద్రమంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగనున్నట్లు ప్రచారం జరుగుతున్న తరుణంలో మురుగన్‌ రాజీనామా చేయడం గమనార్హం.

Updated Date - Oct 14 , 2026 | 04:59 AM