సొంతానికి రూ.99 లక్షల సబ్సిడీ
ABN , Publish Date - Jun 28 , 2026 | 04:12 AM
తన సొంత శాఖ నుంచి రూ.99.60 లక్షలను ‘రాయితీ’ కింద ఖాతాలో వేయించుకున్న కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌధరి వ్యవహారం...
తన శాఖ నుంచే ఇప్పించుకున్న కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్
న్యూఢిల్లీ, జూన్ 27: తన సొంత శాఖ నుంచి రూ.99.60 లక్షలను ‘రాయితీ’ కింద ఖాతాలో వేయించుకున్న కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌధరి వ్యవహారం రాజకీయ దుమారానికి దారి తీసింది. ‘ఇదో తరహా అవినీతి.’ అని విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే.. మంత్రి భగీరథ్ మాత్రం ఈ సొమ్మును ఇతర రైతులకు ఇచ్చినట్టే తనకు కూడా సబ్సిడీ కిందే ఇచ్చారని సమర్థించుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన భగీరథ్ చౌధరి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అదేసమయంలో వాణిజ్య పంటలను ప్రోత్సహించే జాతీయ ఉద్యానవన బోర్డుకు ఎక్స్ అఫిషియో ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. వాణిజ్య పంటల సాగుకు ఈ బోర్డు 50శాతం సబ్సిడీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో తన గ్రామంలో చేసిన కీర దోసకాయల సాగుకు సంబంధించి మంత్రి చౌధరి రూ.99,60,000లను సబ్సిడీ రూపంలో పొందారు. మూడు మాసాల కిందటే ఆయన ఖాతాలో ఈ సొమ్ము పడినట్టు తెలిసింది. అయితే.. మంత్రిగా ఉన్న చౌధరి ఇంత పెద్ద మొత్తంలో రాయితీ పొందడంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ‘‘మోదీ హయాంలో ఇదో తరహా అవినీతి.’’ అని మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు.