గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆపాలి
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:00 AM
గల్ఫ్ దేశాలు, జోర్డాన్‌పై ఇరాన్ దాడులను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం చేసింది. వెంటనే ఆ దేశాలపై దాడులు ఆపాలని ఇరాన్‌ను డిమాండ్ చేసింది....
ఆ దేశాల సార్వభౌమత్వాన్ని కాపాడాలి
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం
భారత్ మద్దతు.. ఓటింగ్‌కు చైనా, రష్యా దూరం
న్యూఢిల్లీ, మార్చి 12: గల్ఫ్ దేశాలు, జోర్డాన్‌పై ఇరాన్ దాడులను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం చేసింది. వెంటనే ఆ దేశాలపై దాడులు ఆపాలని ఇరాన్‌ను డిమాండ్ చేసింది. హోర్ముజ్ జలసంధి మూసివేతను తప్పుపడుతూ.. వాణిజ్య నౌకలు సముద్ర మార్గాల్లో స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు ఉండాలని స్పష్టం చేసింది. ఇరాన్ దాడులను తప్పుపడుతూ చేసిన ఈ తీర్మానాన్ని బహ్రెయిన్ ప్రతిపాదించగా, భారత్ సహా 135 దేశాలు సహ ప్రాయోజిత దేశాలుగా సంతకాలు చేశాయి. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్ దేశాలపై ఇరాన్ దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని.. ప్రపంచ శాంతికి, భద్రతకు తీవ్రమైన ముప్పు అని అభివర్ణించాయి. ఆఫ్రికా ఖండం, గల్ఫ్ ప్రాంతం మధ్యలో ఎర్ర సముద్రానికి, అరేబియా సముద్రానికి అనుసంధానం కల్పించే ‘బాబ్ అల్ మందాబ్‘ జల సంధిలోనూ నౌకా రవాణాకు ఎలాంటి ఆటంకాలూ ఉండకూడదని స్పష్టం చేశాయి. గురువారం భద్రతా మండలిలో దీనిపై ఓటింగ్ జరగగా.. మొత్తం 15 దేశాలకుగాను 13 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. వీటో అధికారమున్న భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలు చైనా, అమెరికా మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి.
ఇరాన్ అధ్యక్షుడితో మోదీ చర్చలు
ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ గురువారం ఫోన్‌లో చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, నౌకా రవాణాపై మాట్లాడారు. దీనికి సంబంధించి ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘‘ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడాను. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరింత పెరుగుతుండటం, సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంపై ఆందోళన వ్యక్తపరిచాను. ఆ ప్రాంతంలోని భారత జాతీయుల భద్రత, ఎలాంటి ఆటంకం లేకుండా సరుకులు, చమురు సరఫరా భారత్‌కు ప్రాధాన్య అంశాలని వివరించాను. భారత్ ఎప్పుడూ శాంతికి, స్థిరత్వానికి కట్టుబడి ఉంటుందని.. పశ్చిమాసియాలో సమస్యను చర్చలు, దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశాను’’ అని మోదీ తెలిపారు.