Share News

ఉమర్‌ ఖలీద్‌ బెయిల్‌ కేసు విస్తృత ధర్మాసనానికి

ABN , Publish Date - May 23 , 2026 | 04:11 AM

ఢిల్లీ అల్లర్ల కేసులో ఇద్దరు నిందితులకు శుక్రవారం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు కీలక నిందితుడు ఉమర్‌ ఖలీద్‌ సమస్యను మాత్రం విస్తృత ధర్మాసనం ముందుంచాలని ప్రతిపాదించింది...

ఉమర్‌ ఖలీద్‌ బెయిల్‌ కేసు విస్తృత ధర్మాసనానికి

న్యూఢిల్లీ, మే 22: ఢిల్లీ అల్లర్ల కేసులో ఇద్దరు నిందితులకు శుక్రవారం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు కీలక నిందితుడు ఉమర్‌ ఖలీద్‌ సమస్యను మాత్రం విస్తృత ధర్మాసనం ముందుంచాలని ప్రతిపాదించింది. ‘ఉపా’ వంటి ఉగ్రవాద నిరోధక చట్టాల్లో బెయిల్‌ మంజూరుకు కఠినమైన నిబంధనలు ఉండగా... నిందితుడ్ని ఎలాంటి విచారణ లేకుండా సుదీర్ఘకాలంపాటు జైలులో ఉంచడం, విచారణలో తీవ్రమైన జాప్యం జరుగుతున్న సందర్భాల్లో వాటిని అతిక్రమించి బెయిల్‌ ఇవ్వవచ్చా అన్న సమస్యకు పరిష్కారం కోసం ఈ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, జస్టిస్‌ పి.బి.వరాలేల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. విస్తృత ధర్మాసనం ఏర్పాటు అంశాన్ని పరిశీలించేందుకు సమస్యను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ముందు ఉంచాలని సూచించింది. పలు షరతులు విధిస్తూ నిందితులైన అబ్దుల్‌ ఖలీద్‌ సైఫీ, తస్లీం అహ్మద్‌లకు ఆరు నెలల పాటు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. ఇదే కేసులోని నిందితులైన ఉమర్‌ ఖలీద్‌, షార్జీల్‌ ఇమామ్‌లకు బెయిల్‌ నిరాకరిస్తూ జనవరి 5న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను ఇటీవల మరో న్యాయమూర్తి జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ల ధర్మాసనం విమర్శించింది. ఉగ్రవాదం కేసుల్లోనూ బెయిల్‌ ఇవ్వడం రూలని, జైలులో ఉంచడం ప్రత్యేక సందర్భమని స్పష్టం చేసింది. తాజా విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసుల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు దీనిపై అభ్యంతరం తెలిపారు. ఉగ్రవాద నిరోధక చట్టాల్లోని నిబంధనలను కాదని బెయిల్‌ ఇవ్వవచ్చా అన్న ప్రశ్నను లేవనెత్తారు. సమస్యను విస్తృత ధర్మాసనం పరిశీలనకు పంపాలని కోరగా, అందుకు సానుకూలంగా స్పందించింది. ఇదిలా ఉండగా, ఉమర్‌ ఖలీద్‌కు ఢిల్లీ హైకోర్టు మూడు రోజుల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఆపరేషన్‌ చేయించుకోనున్న తన తల్లిని చూసేందుకు జూన్‌ ఒకటి నుంచి మూడు రోజుల పాటు బెయిల్‌ ఇస్తున్నట్టు జస్టిస్‌ ప్రతిభా సింగ్‌, జస్టిస్‌ మధు జైన్‌ల ధర్మాసనం తెలిపింది. ఆమెకు జరిగేది చిన్న శస్త్ర చికిత్స కావడంతో బెయిల్‌ అవసరం లేదని తొలుత ట్రయల్‌ కోర్టు భావించగా, హైకోర్టు మాత్రం సానుభూతి చూపించి మంజూరు చేసింది.

Updated Date - May 23 , 2026 | 04:11 AM