కేరళం యూడీఎఫ్‌దే
ABN , Publish Date - May 05 , 2026 | 05:22 AM
కమ్యూనిస్టుల కంచుకోట కేరళంలో.. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కూటమి గెలుపు జెండా ఎగరేసింది! పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ఆ కూటమి సెంచరీ దాటేసి ....
పదేళ్ల ఎల్డీఎఫ్ పాలనలో అవినీతి, ఆర్థిక సంక్షోభం, కుంభకోణాలతో విసుగెత్తిపోయిన జనం
కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి పట్టం
140 సీట్లకుగాను యూడీఎఫ్‌కు 102 సీట్లు
35 సీట్లతో సరిపెట్టుకున్న అధికార ఎల్డీఎఫ్
తిరువనంతపురం, మే 4: కమ్యూనిస్టుల కంచుకోట కేరళంలో.. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కూటమి గెలుపు జెండా ఎగరేసింది! పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ఆ కూటమి సెంచరీ దాటేసి 102 సీట్లతో రాజకీయసునామీ సృష్టించింది!! అంతేనా.. కేరళలో ఎప్పుడో 2016 ఎన్నికల్లో ఒక్క సీటు సాధించిన భారతీయ జనతాపార్టీ పదేళ్ల తర్వాత ఇప్పుడు మూడు సీట్లలో గెలిచి సత్తా చాటింది. వరుసగా పదేళ్లపాటు అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ కూటమి కేవలం 35 స్థానాలకు పరిమితమైంది!! రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారడం.. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడితప్పడం, పెన్షన్ల పంపిణీ సైతం నెలల తరబడి ఆలస్యం కావడం.. ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు, జరిగిన కుంభకోణాలు.. ఈ పరిణామాలన్నీ కలిసి విజయన్ పాలనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. వీటన్నింటికీ తోడు.. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో కఠినంగా వ్యవహరించి హిందువుల ఆగ్రహాన్ని.. క్రైస్తవుల ఓటు బ్యాంకు కోసం ప్రయత్నించి ముస్లింల ఆగ్రహాన్ని కూడగట్టుకున్న ఎల్డీఎఫ్ కూటమి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. చివరకు ఏ వర్గం ఓట్లు కూడా సాధించలేక చతికిలపడింది. మరో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే.. కేరళం చరిత్రలో తొలిసారి బీజేపీ మూడు స్థానాల్లో (నేమోం, చాతన్నూర్, కాళకూటం అసెంబ్లీ నియోజకవర్గాల్లో) విజయం సాధించింది. కమలనాథులకు ఈ ఎన్నికల్లో కేరళంలో ఒక్క సీటు కూడా రాదంటూ కాంగ్రెస్, సీపీఎం నేతలు ప్రచార సమయంలో ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. వారికి ఈ ఫలితాలే సమాధానమని బీజేపీ కేరళ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఆయన స్వయంగా నేమోం నియోజకవర్గం నుంచి గెలుపొందడం విశేషం. (2016లో కూడా బీజేపీ గెలిచింది ఈ నియోజకవర్గం నుంచే. అప్పట్లో బీజేపీ సీనియర్ నేత రాజగోపాల్ నేమోం నుంచి పోటీ చేసి గెలిచారు.) ఇక, చాతన్నూర్‌లో బీబీ గోపకుమార్, కాళకూటంలో కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ విజయం సాధించారు. కాగా.. కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ ఈ ఎన్నికల్లో కంజరప్పల్లి స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ధర్మదం నుంచి పోటీ చేసిన సీఎం పినరాయి విజయన్ ఈసారి 19,247 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఫలితాల వెల్లడి అనంతరం పినరాయి విజయన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.