Share News

జ్ఞానేశ్‌ రాజీనామా చేసి వెళ్లిపో

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:11 AM

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా శివసేన (యూబీటీ) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే సంయుక్తంగా ఆదివారం ముంబైలో

జ్ఞానేశ్‌ రాజీనామా చేసి వెళ్లిపో

  • బీజేపీ చేతిలో నువ్వు ఓ ఆయుధం

  • అధికారం ఎవరికనేది ప్రజలు నిర్ణయిస్తారు

  • మహారాష్ట్రలో సర్‌ను రద్దు చేయాలి

  • ఈసీకి వ్యతిరేకంగా ముంబైలో ఉద్ధవ్‌ ఠాక్రే, రాజ్‌ ఠాక్రే సంయుక్త ర్యాలీ

  • మద్దతు తెలిపిన కాంగ్రెస్‌, శివసేన (ఎస్పీ)

  • సీఈసీ నిర్ణయాలపై నేడు సుప్రీంలో విచారణ

ముంబై, అక్టోబరు 4: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా శివసేన (యూబీటీ) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే సంయుక్తంగా ఆదివారం ముంబైలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ‘విరాట్‌ గర్జన మోర్చా’ పేరుతో జరిగిన ఈ ర్యాలీలో కాంగ్రెస్‌తోపాటు శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీ(ఎస్పీ) నేతలు కూడా పాల్గొని మద్దతు పలికారు. బైకులాలోని రిచర్డ్‌సన్‌ అండ్‌ క్రుద్దాస్‌ నుంచి ఆదివారం ఉదయం మొదలైన ఈ ర్యాలీ దక్షిణ ముంబైలోని బీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు కొనసాగింది. పార్టీ జెండాలను పక్కన పెట్టి.. జాతీయ పతాకాన్ని చేబూని ఈ ర్యాలీ నిర్వహించడం గమనార్హం. ఈసీఐ ఒక్కటే తమ అజెండా అని, బీజేపీ సైతం ర్యాలీలో పాల్గొనవచ్చని రాజ్‌ఠాక్రే ప్రకటించారు. జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, మహారాష్ట్రలో నిర్వహించిన సర్‌ను రద్దు చేయాలని ఠాక్రే సోదరులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఉద్ధవ్‌ ఠాక్రే.. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ బీజేపీ చేతిలో ఆయుధంలా, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బంగ్లాదేశ్‌ అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా సర్‌ చేపట్టినట్లయితే ఎంత మంది అక్రమ వలసదారులను గుర్తించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహారాష్ట్రలో సర్‌ తర్వాత సుమారు 2 కోట్ల మంది ఓటర్లు ముసాయిదా జాబితాలో కనిపించకపోవడాన్ని ప్రస్తావించారు.


అధికారంలోకి రావడానికి బీజేపీ ఓట్లను, ఎమ్మెల్యేలను చోరీ చేస్తోందని ఆరోపించారు. ఎంఎన్‌ఎస్ చీఫ్‌ రాజ్‌ఠాక్రే మాట్లాడుతూ.. బ్యాలట్‌ విధానంలో తిరిగి ఎన్నికలను నిర్వహించాలని కోరారు. ఎవరు అధికారంలో ఉండాలో ఎన్నికల సంఘం నిర్ణయించజాలదని, దాన్ని ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. ఇదిలా ఉండగా, సర్‌కు సంబంధించి సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ నిర్వహించనుంది.

Updated Date - Oct 05 , 2026 | 05:13 AM