Share News

వేరుకుంపటికి అనుమతించవద్దు

ABN , Publish Date - Jun 19 , 2026 | 02:42 AM

తమ పార్టీ నుంచి వేరుపడేందుకు సిద్ధమైన ఆరుగురు ఎంపీలను అందుకు అనుమతించరాదని ఉద్ధవ్‌ థాకరే సారథ్యంలోని శివసేన (ఉద్ధవ్‌)..

వేరుకుంపటికి అనుమతించవద్దు

  • లోక్‌సభ స్పీకర్‌కు శివసేన (ఉద్ధవ్‌) అభ్యర్థన

  • ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ భేటీ

  • 9 మంది ఎంపీల్లో ముగ్గురే హాజరు

న్యూఢిల్లీ, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): తమ పార్టీ నుంచి వేరుపడేందుకు సిద్ధమైన ఆరుగురు ఎంపీలను అందుకు అనుమతించరాదని ఉద్ధవ్‌ థాకరే సారథ్యంలోని శివసేన (ఉద్ధవ్‌).. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను అభ్యర్థించింది. ఈ మేరకు పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్‌రౌత్‌ సారథ్యంలో ముగ్గురు లోక్‌సభ ఎంపీలు ఓం బిర్లాను కలిసి విజ్ఞాపనపత్రం అందజేశారు. గురువారం ఢిల్లీలో శివసేన (ఉద్ధవ్‌) పార్లమెంటరీపార్టీ సమావేశం జరిగింది. దీనికి ఎంపీలందరూ హాజరు కావాలని అంతకుముందే విప్‌ జారీ చేశారు. ఈ భేటీకి ఏకైక రాజ్యసభ ఎంపీ అయిన సంజయ్‌రౌత్‌తోపాటు పార్టీ లోక్‌సభ ఎంపీలు అరవింద్‌ సావంత్‌, అనిల్‌ దేశాయి, రాజభావు వాజే మాత్రమే హాజరయ్యారు. మిగతా ఆరుగురు నగేశ్‌ ఆషిట్కర్‌, సంజయ్‌ దేశ్‌ముఖ్‌, సంజయ్‌ యాదవ్‌, సంజయ్‌ దీనా పాటిల్‌, ఓం ప్రకాశ్‌ రజేనింబల్కర్‌, భావుసాహెబ్‌ వక్‌ చుక్రే రాలేదు. విప్‌ జారీ చేసినప్పటికీ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నిస్తూ పార్టీ నాయకత్వం ఈ ఆరుగురు ఎంపీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఎంపీల బృందం ఓం బిర్లాను కలిసి ఆరుగురిపై ఫిర్యాదు చేసింది. వారి గైర్హాజరుపై సంజయ్‌ రౌత్‌ నిప్పులు చెరిగారు. శివసైనికుల క్రోధాగ్నికి బలవుతారని.. దాన్నించి కాపాడుకోవాలంటే ఆర్మీ, వాయుసేన సహకారం తీసుకోవాల్సిందేనని హెచ్చరించారు.

విప్‌ వర్తించదన్న ధీమాలో చీలిక వర్గం

తాము ఏక్‌నాథ్‌ షిండే నాయకత్వంలోని శివసేనలో విలీనం అవుతున్నామని పేర్కొంటూ సదరు ఆరుగురు ఎంపీలు బుధవారమే తమ సంతకాలతో కూడిన లేఖను స్పీకర్‌ ఓం బిర్లాకు సమర్పించారు. ఉద్దవ్‌ థాకరే నేతృత్వంలోని శివసేన.. పార్టీ మూలసిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరించి కాంగ్రెస్‌తో చేతులు కలిపినందుకే తాము అసంతృప్తికి గురయ్యామని వారు స్పీకర్‌కు చెప్పినట్లు సమాచారం. తమను ఏక్‌నాథ్‌ షిండే వర్గంగా పరిగణించి లోక్‌సభలో ఆ పార్టీ ఎంపీల పక్కనే సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో ఏవైనా బిల్లుల మీద ఓటింగ్‌ జరిగేటప్పుడే విప్‌ వర్తిస్తుందిగానీ పార్టీ సమావేశాలకు వర్తించదని చీలిక వర్గం భావిస్తోంది.

Updated Date - Jun 19 , 2026 | 02:42 AM