బ్రహ్మోస్ కొనుగోలుకు యూఏఈ ప్రయత్నాలు
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:04 AM
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో తమ దేశ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకునేందుకు యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) చర్యలు చేపట్టింది.
న్యూఢిల్లీ, జూన్ 22: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో తమ దేశ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకునేందుకు యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) చర్యలు చేపట్టింది. అందులో భాగంగా భారత్ నుంచి బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులతోపాటు ఆకాశ్‌తీర్ గగనతల రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ప్రాథమికంగా చర్చలు ప్రారంభించింది. బ్రహ్మోస్, ఆకాశ్‌తీర్ సహా భారత్‌కు చెందిన ప్రధాన రక్షణ వ్యవస్థల్లో కొన్నింటిని యూఏఈ కొనుగోలు చేసే విషయంలో ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. బ్రహ్మోస్ క్షిపణిని భారత్, రష్యా సంయుక్తంగా తయారు చేశాయి. భారతదేశం దీన్ని ఇతరదేశాలకు విక్రయించేందుకు రష్యా నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే, యూఏఈకి కూడా రష్యాతో సన్నిహిత సంబంధాలు ఉన్నందున రష్యా నుంచి అనుమతి పొందడానికి ఆటంకాలు ఏమీ ఉండకపోవచ్చని ఒక అధికారి తెలిపారు.