Share News

టీవీఎస్‌లో ముదిరిన ఇంటి పోరు

ABN , Publish Date - Nov 17 , 2026 | 02:50 AM

దక్షిణాది పారిశ్రామిక దిగ్గజం టీవీఎస్‌ కుటుంబంలో ఆస్తుల వివాదం న్యాయపోరు దిశగా కదిలింది. ఉమ్మడి కుటుంబ ఆస్తులన్నింటిలో తనకు సమాన వాటా పంచాల్సిందేనంటూ..

టీవీఎస్‌లో ముదిరిన ఇంటి పోరు

  • కుటుంబ ఆస్తిలో సోదరుడు సుదర్శన్‌తో సమాన వాటా కోసం వేణుశ్రీనివాసన్‌కు కుమార్తె లక్ష్మి నోటీసు

  • కూతురికే తల్లి మల్లికా శ్రీనివాసన్‌ మద్దతు

  • అవి నా సొంత ఆస్తులు.. పంపకం న్యాయంగానే జరిగింది: వేణు

  • 115 ఏళ్ల పారిశ్రామిక కుటుంబంలో చీలిక

2024లో కుటుంబంలోని నలుగురూ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. టీవీఎస్‌ బ్రాండ్‌, ట్రేడ్‌ మార్క్‌లను ఎవరు ఎక్కడ వాడాలనేది అందులో ఉంది. టీవీఎస్‌ మోటార్‌, టీవీఎస్‌ క్రెడిట్‌ బాధ్యతలను సుదర్శన్‌ చూస్తుండగా.. సుందరం-క్లేటన్‌, టాఫే బాధ్యతలను లక్ష్మి, మల్లిక చూస్తున్నారు. 2025 ఏప్రిల్‌ 16న టీవీఎస్‌ హోల్డింగ్స్‌కు ‘సిగ్నిఫికెంట్‌ బెనిఫిషియల్‌ ఓనర్‌’ సుదర్శన్‌ అని ఆ కంపెనీ స్టాక్‌ ఎక్స్చేంజీల్లో ఫైల్‌ చేయడంతో విభేదాలు మొదలయ్యాయి.

చెన్నై, నవంబరు 16: దక్షిణాది పారిశ్రామిక దిగ్గజం టీవీఎస్‌ కుటుంబంలో ఆస్తుల వివాదం న్యాయపోరు దిశగా కదిలింది. ఉమ్మడి కుటుంబ ఆస్తులన్నింటిలో తనకు సమాన వాటా పంచాల్సిందేనంటూ.. టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ చైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌కు ఆయన కుమార్తె లక్ష్మి వేణు నోటీసులు పంపారు. ఈ విషయాన్ని ఆమె కార్యాలయం సోమవారం ప్రకటించింది. 2005లో సవరించిన హిందూ వారసత్వ చట్టం-1956లోని సెక్షన్‌ 6 ప్రకారం.. కుమార్తెగా ఉమ్మడి కుటుంబ ఆస్తిలో తనకు సమాన హక్కు ఉందని ఆమె పేర్కొన్నారు. ఆ సెక్షన్‌ ప్రకారం.. టీవీఎస్‌ హోల్డింగ్స్‌, టీవీఎస్‌ మోటార్స్‌, టీవీఎస్‌ క్రెడిట్‌ సర్వీసెస్‌, సుందరం క్లేటన్‌ కంపెనీల ఈక్విటీల్లో వాటాలతో పాటు ఇతర ఉమ్మడి ఆస్తులన్నిటిలో తనకు సోదరుడితో సమాన వాటా ఉందని లక్ష్మీ వేణు స్పష్టం చేశారు. కానీ, తన తండ్రి.. సోదరుడు, టీవీఎస్‌ మోటార్‌ ఛైర్మన్‌ అయిన సుదర్శన్‌ వేణుకు ఎక్కువ ప్రయోజనం కలిగించే వాటా కట్టబెట్టారని లక్ష్మి ఆరోపించారు. ఇది చట్ట ఉల్లంఘనే కాక నమ్మక ద్రోహం కూడా అని ఆమె వాపోయారు. ‘‘చట్టంలో గానీ, ప్రగతిశీల భారతదేశంలో గానీ పితృస్వామ్యానికి చోటు లేదు’’ అని లక్ష్మి స్పష్టం చేశారు. ఏకపక్ష నిర్ణయాలు, కార్పొరేట్‌ ఒప్పందాల ద్వారా కుమార్తెల హక్కులను కాలరాయలేరని ఆమె తేల్చిచెప్పారు. కాగా.. ట్రాక్టర్ల సంస్థ టాఫే ఛైర్మన్‌, వేణు శ్రీనివాసన్‌ భార్య అయిన మల్లికా శ్రీనివాసన్‌.. బహిరంగంగా తన కుమార్తెకు మద్దతు పలికారు. ‘‘తల్లిగా నాకు కొడుకు, కూతురు అన్ని విధాలా సమానం. సుదర్శన్‌కు తీసిపోని న్యాయమైన వాటా లక్ష్మికి ఉందని నమ్ముతున్నాను’’ అని ఆమె పేర్కొన్నారు.


ఇదీ నేపథ్యం..

ఈ వివాదానికి మూలాలు 2020లో జరిగిన ఉమ్మడి కుటుంబ ఒప్పందం, 2024లో వేణు శ్రీనివాసన్‌ కుటుంబసభ్యుల మధ్య జరిగిన అవగాహన ఒప్పందంలో ఉన్నాయి. ఆ రెండు ఒప్పందాల కథ తెలియాలంటే.. 115 సంవత్సరాల టీవీఎస్‌ గ్రూపు చరిత్ర తెలియాలి. ఈ గ్రూపు వ్యవస్థాపకుడు తిరుక్కురుంగుడి వేంగరం సుందరం అయ్యంగార్‌ (1877-1955). తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాకు చెందిన ఆయన.. న్యాయవాదిగా తన కెరీర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత కొన్నాళ్ల భారతీయ రైల్వేలో, తర్వాత కొన్నాళ్లు ఒక బ్యాంకులో ఉద్యోగిగా పనిచేశారు. ఉద్యోగాలతో లాభం లేదని గ్రహించి.. 1911లో ‘టీవీ సుందరం అయ్యంగార్‌ అండ్‌ సన్స్‌’ పేరుతో ట్రాన్స్‌పోర్టు వ్యాపారంలోకి దిగారు. ఆయన వ్యాపార సామ్రాజ్యం మదురైలో ఒక బస్సు సర్వీసుతో మొదలైంది. టీవీఎస్‌ గ్రూప్‌ ప్రస్థానానికి నాంది అదే. 1955లో ఆయన చనిపోయే నాటికి.. టీవీఎస్‌ గ్యాస్‌ ప్లాంట్‌, రబ్బర్‌ రీట్రేడింగ్‌ కంపెనీ, మద్రాస్‌ ఆటో సర్వీస్‌ లిమిటెడ్‌, సుందరం మోటార్స్‌ వంటి విభాగాలతో ఆయన వ్యాపార సామ్రాజ్యం భారీగా విస్తరించింది. వాటిలో ‘మద్రాస్‌ ఆటో సర్వీస్‌’ సంస్థ ఒకదశలో.. అమెరికా వాహన దిగ్గజ సంస్థ జనరల్‌ మోటార్స్‌కు భారతదేశంలో అతి పెద్ద డిస్ట్రిబ్యూటర్‌గా నిలిచింది. సుందరం అయ్యంగార్‌కు ఐదుగురు కుమారులు. పెద్ద కుమారుడైన టీఎస్‌ దొరస్వామి.. తన తండ్రి కన్నా ముందే, 1943లోనే చిన్నవయసులో మరణించారు. దరిమిలా మిగిలిన నలుగురు కుమారుల కుటుంబాలు టీవీఎస్‌ గ్రూపులో నాలుగు శాఖలుగా స్థిరపడ్డాయి. ఒక్కో శాఖా ఒక్కో కుమారుడి నేతృత్వంలో కార్యకలాపాలు కొనసాగించింది. ఎవరి వ్యాపారం వారిదే అయినా.. గ్రూపులోని 90కి పైగా కంపెనీల వాటాలు ఒకదానిలో ఒకటి కలిసిపోయి ఉండేవి. అంటే ఒక కుమారుడికి చెందిన కుటుంబ శాఖ నిర్వహిస్తున్న కంపెనీల్లో మిగతా శాఖల వాటాలు కూడా ఉండేవి. దీనివల్ల ఏ కంపెనీకి ఎవరు పూర్తి యజమాని అనే విషయంలో స్పష్టత ఉండేది కాదు. పైగా.. మూడు, నాలుగో తరం వారసులు పెద్ద సంఖ్యలో వ్యాపారంలోకి వచ్చారు.


దీనివల్ల ఉమ్మడిగా, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో ఎవరి వ్యాపారాలకు వారే పూర్తి యజమానులుగా ఉంటే వేగంగా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చని అంతా భావించి 2020లో.. గ్రూపులోని 4 ప్రధాన కుటుంబ శాఖల మధ్య అధికారికంగా వ్యాపారాల విభజనకు ఒక ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగా.. గ్రూపులో కీలకమైన టీవీఎస్‌ మోటార్‌, టీవీఎస్‌ హోల్డింగ్స్‌, సుందరం-క్లేటన్‌, టీవీఎస్‌ క్రెడిట్‌ సంస్థలు వేణు శ్రీనివాసన్‌ శాఖకు దక్కాయి. అయితే, ఆ ఆస్తులన్నీ వీఎస్‌ ట్రస్టు, టీవీఎస్‌ హోల్డింగ్స్‌ కింద ఉమ్మడిగానే ఉన్నాయి తప్ప వేణు శ్రీనివాసన్‌ కుటుంబసభ్యుల (వేణు, ఆయన భార్య మల్లిక, కుమారుడు సుదర్శన్‌, కుమార్తె లక్ష్మి) మధ్య విడివిడిగా పంపకాలు జరగలేదు. కాకపోతే.. 2024లో వారు నలుగురూ ఒక అవగాహన ఒప్పందం(ఎంవోయు)పై సంతకాలు చేశారు. దాని ప్రకారం టీవీఎస్‌ మోటార్‌, టీవీఎస్‌ క్రెడిట్‌ బాధ్యతలను వేణు శ్రీనివాసన్‌ కుమారుడైన సుదర్శన్‌ చూస్తుండగా.. సుందరం-క్లేటన్‌, టాఫే (ట్రాక్టర్స్‌ అండ్‌ ఫామ్‌ ఎక్వి్‌పమెంట్‌ లిమిటెడ్‌) బాధ్యతలను చూస్తున్నారు. ఇదిలా నడుస్తుండగా.. 2025 ఏప్రిల్‌ 16న టీవీఎస్‌ హోల్డింగ్స్‌కు ‘సిగ్నిఫికెంట్‌ బెనిఫిషియల్‌ ఓనర్‌ (ఎస్‌బీవో)’ సుదర్శన్‌ అని ఆ కంపెనీ స్టాక్‌ ఎక్స్చేంజీల్లో ఫైల్‌ చేసింది. అప్పట్నుంచే కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి.


నెల రోజుల క్రితం..

ఈ ఏడాది అక్టోబరులో టీవీఎస్‌ హోల్డింగ్స్‌ వార్షిక నివేదిక ద్వారా ఎస్‌బీవో వివరాలు మరోసారి చర్చకు రావడంతో లక్ష్మి, మల్లిక బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. 2024 నాటి ఎంవోయును అడ్డుపెట్టుకుని గ్రూపులోనే అత్యంత విలువైన టీవీఎస్‌ మోటార్‌ ఆధిపత్యాన్ని సుదర్శన్‌కు.. తక్కువ విలువైన సుందరం-క్లేటన్‌ను తనకు దక్కేలా పరోక్షంగా మార్పులు చేశారని లక్ష్మి ఆరోపిస్తున్నారు. 2020 నాటి ఒప్పందం ప్రకారం వేణు శ్రీనివాసన్‌కు వచ్చింది పిత్రార్జితం అని.. అందులో తనకు సమానవాటా ఉంటుందని ఆమె వాదిస్తున్నారు. 2024లో జరిగింది కేవలం టీవీఎస్‌ బ్రాండ్‌ వినియోగానికి సంబంధించిన ఎంవోయూనే తప్ప ఆస్తుల విభజన కాదని ఆమె పేర్కొంటున్నారు. అయితే.. వేణు శ్రీనివాసన్‌ మాత్రం వివాదంలో ఉన్న ఆస్తులన్నీ తన స్వార్జితం తప్ప అవి ఉమ్మడి కుటుంబ ఆస్తులు కాదని వాదిస్తున్నారు.

Updated Date - Nov 17 , 2026 | 02:53 AM