విజయ్ ఆస్తులు 603 కోట్లు
ABN , Publish Date - Mar 31 , 2026 | 04:46 AM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీచేస్తున్న ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్ తన ఆస్తులను వెల్లడించారు.
చరాస్తులు రూ.404 కోట్లు, స్థిరాస్తులు 198 కోట్లు
పెరంబూరులో నామినేషన్ వేసిన టీవీకే అధినేత
చెన్నై, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీచేస్తున్న ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్ తన ఆస్తులను వెల్లడించారు. సోమవారం పెరంబూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్‌లో ఆయన ఈ వివరాలను పొందుపరిచారు. మొత్తం ఆయన ఆస్తుల విలువ రూ.603.20కోట్లు కాగా.. అందులో చరాస్తులు రూ.404.58 కోట్లు, రూ.198.62 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. తన పూర్వీకుల నుంచి రూ.21.81 కోట్ల ఆస్తి వారసత్వంగా వచ్చినట్లు విజయ్ పేర్కొన్నారు. ఆయన భార్య సంగీత పేరుపై రూ.15 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో తన పేరుపై రూ.213 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్లు విజయ్ పేర్కొన్నారు. నామినేషన్ అనంతరం పెరంబూరులో ప్రచారం చేపట్టిన విజయ్ మాట్లాడుతూ.. స్టాలిన్ సార్‌కు ఇవే చివరి ఎన్నికలని, ఆయన్ని ఇంటికి సాగనంపాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించారని పేర్కొన్నారు. తన వద్ద బీఎండబ్ల్యూ 530, బీఎండబ్ల్యూ ఐ7, టయోటా లెక్సెస్ 350, టయోటా వెల్ఫైర్, మారుతీ సుజుకి స్విఫ్ట్ వంటి రూ.14.35 కోట్ల విలువ చేసే వాహనాలు ఉన్నట్లు నామినేషన్ పత్రంలో వివరించారు. టీవీఎస్ ఎక్సెల్ సూపర్ ఉన్నట్లు కూడా పేర్కొనడం గమనార్హం.
తమిళనాడు సీఎం స్టాలిన్‌కు రూ.7.63 కోట్ల ఆస్తులు
తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వద్ద సొంత వాహనం గానీ, వీసమెత్తు బంగారం గానీ లేవని కొళత్తూరు నియోజకవర్గంలో దాఖలు చేసిన నామినేషన్ ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. తన పేరున రూ.3.30 కోట్ల చరాస్తులు, రూ.4.33 కోట్ల విలువైన స్థిరాస్తులు.. మొత్తం రూ.7.63 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.