ఏడాదిలోనే 26 లక్షల కోట్లు
ABN , Publish Date - Feb 21 , 2026 | 02:21 AM
ఇతర దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వస్తువులపై భారీగా సుంకాలు విధించటం ద్వారా అమెరికా ఖజానాను నింపాలన్న ట్రంప్ ఆశయం గతేడాది నెరవేరింది.
ట్రంప్ సుంకాలతో అమెరికా ఖజానాకు భారీగా ఆదాయం
వాషింగ్టన్, ఫిబ్రవరి 20: ఇతర దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వస్తువులపై భారీగా సుంకాలు విధించటం ద్వారా అమెరికా ఖజానాను నింపాలన్న ట్రంప్ ఆశయం గతేడాది నెరవేరింది. 2025 ఏప్రిల్‌లో భారత్ సహా అనేక దేశాలపై సుంకాలను భారీగా విధించిన తర్వాత నుంచి కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు, ఫీజుల ద్వారా అంతకుముందు ఉన్న సుంకాలతో కలిపి మొత్తంగా దాదాపు రూ.26,06,300 (287 బిలియన్‌డాలర్లు) కోట్ల ఆదాయం వచ్చింది. 2024తో పోల్చితే ఇది ఏకంగా మూడింతలు అఽధికం కావటం గమనార్హం. అన్ని దేశాలపై కలిపి ట్రంప్ సగటున 17ుసుంకాలు విధించారు. 1932 తర్వాత ఇవే అత్యధిక సుంకాలు.
వాణిజ్య లోటు తగ్గినా..
ఇతర దేశాలతో అమెరికాకు ఉన్న వాణిజ్య లోటును తగ్గించి, తన దేశంలోని వస్తూత్పత్తి పరిశ్రమను బలోపేతం చేయటం కోసమే సుంకాలు విధిస్తున్నట్లు నాడు ట్రంప్ ప్రకటించారు. ఇతర దేశాల నుంచి అమెరికా కొంటున్న వస్తువులు అధికంగా, ఇతర దేశాలకు అమెరికా అమ్ముతున్న వస్తువులు తక్కువగా ఉంటున్నాయని.. ఈ పరిస్థితిని సుంకాల ద్వారా మార్చేస్తానని ఆయన తెలిపారు. ట్రంప్ ఆశించినట్లుగానే వాణిజ్య లోటు 2009 సెప్టెంబర్ స్థాయికితగ్గింది. అయితే, అమెరికాలో తయారీ పరిశ్రమ భారీగా వృద్ధి సాధిస్తుందని, ఉద్యోగాల కల్పన జరుగుతుందన్న ట్రంప్ అంచనాలు తప్పాయి. సుంకాల వల్ల ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువుల ధరలు పెరిగినప్పటికీ.. అమెరికా కంపెనీలు కొనుగోళ్లను కొనసాగించాయి. దీంతో అమెరికాలో ఆ వస్తువుల ధరలు పెరిగి అంతిమంగా ఆ దేశ ప్రజలపైనే అధిక భారం పడింది. మరోవైపు అమెరికాలో వస్తూత్పత్తి ఆశించిన స్థాయిలో పెరగకపోవటంతో ఉద్యోగాల కల్పన కూడా జరగలేదు. సుంకాలు అధికంగా ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమ మరింత ఒత్తిడికి గురైంది. అయితే, దీర్ఘకాలంలో దేశంలోనే కొత్త కంపెనీలు పుట్టుకొస్తాయని ట్రంప్ వాదన.
అమెరికా ప్రజలపైనే భారం
ట్రంప్ సుంకాలు అంతిమంగా ఆయన దేశ ప్రజలపైనే అధిక ధరల భారం మోపాయి. అమెరికా ప్రజలు వినియోగిస్తున్న వస్తువుల్లో అత్యధికం ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుండటంతో.. సుంకాల వల్ల వాటి ధరలు పెరిగాయి. దీంతో అమెరికా రిటైల్ సంస్థలు ప్రారంభంలో వస్తువుల ధరలను పెంచాయి. తర్వాతి కాలంలో కొనుగోలుదారులను కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో లాభాలను కొంతవరకు తగ్గించుకొని ధరలను తగ్గించాయి. దీంతో 2025 చివరి నాటికి అమెరికాలో రిటైల్ ద్రవ్యోల్బణం సాధారణ స్థితికి వచ్చింది. అయినా, ట్రంప్ టారి్‌ఫల వల్ల తమ జీవితాలు దుర్బరంగా మారాయని ఓ సర్వేలో 51ు మంది తెలిపారు.