Share News

త్రిష బర్త్‌డే స్పెషల్‌..!

ABN , Publish Date - May 05 , 2026 | 05:45 AM

నటి త్రిషకు సోమవారం (మే 4) ఎంతో ప్రత్యేకమైన రోజు... ఆమె 43వ పుట్టినరోజు.. మరోవైపు ఆమె సన్నిహిత మిత్రుడు దళపతి విజయ్‌ రాజకీయ భవిష్యత్తును తేల్చే ఎన్నికల ఫలితాల రోజు...

త్రిష బర్త్‌డే స్పెషల్‌..!

  • శ్రీవారి ఆశీస్సులతో నేరుగా విజయ్‌ ఇంటికి

  • కారులో కూర్చుని విజయకేతనం చూపిస్తూ హర్షం

తిరుమల, చెన్నై, మే 4 (ఆంధ్రజ్యోతి): నటి త్రిషకు సోమవారం (మే 4) ఎంతో ప్రత్యేకమైన రోజు... ఆమె 43వ పుట్టినరోజు.. మరోవైపు ఆమె సన్నిహిత మిత్రుడు దళపతి విజయ్‌ రాజకీయ భవిష్యత్తును తేల్చే ఎన్నికల ఫలితాల రోజు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొన్న ఆమె పఠనం అనంతరం గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు. ఈ సందర్భంగా త్రిషను వేదపండితులు ఆశీర్వదించగా, ఆలయ సిబ్బంది లడ్డూప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన త్రిషను చూస్తూ ఓ అభిమాని ‘మేడం ఈ రోజు రిజల్స్ట్‌ మొత్తం మనవే..’ అంటూ పెద్దగా అరవగా... త్రిష నవ్వుకుంటూ వెళ్లిపోయారు. తిరుమల నుంచి నేరుగా చెన్నైలోకి దళపతి విజయ్‌ నివాసానికి చేరుకున్నారు. గేటు బయట కారులో కూర్చునే విజయకేతనం చూపిస్తూ లోపలికి వెళ్లారు. కాగా, ఆమె పుట్టిన రోజు.. తమిళనాడు ఎన్నికల ఓట్ల లెక్కింపు ఒకేరోజు కావడంతో ఆమె తిరుమల పర్యటన రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయ్‌ రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి త్రిష ఆయనకు వెన్నంటి ఉంటూ మద్దతు తెలుపుతున్నారు. విజయ్‌ గెలుపు కోరుకుంటూ ఆమె తిరుమలకు వచ్చారనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

త్రిష-విజయ్‌ బంధం

దక్షణాదిలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న త్రిష, తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌ మధ్య బంధం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వాటిపై వాళ్లు ఎప్పుడూ స్పందించలేదు. ఇదిలా ఉండగా.. విజయ్‌ భార్య సంగీత కూడా ఆయన తనను మోసం చేశాడని ఆరోపిస్తూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసు కోర్టుకు చేరింది. అదే సమయంలో విజయ్‌, త్రిష మధ్య సన్నిహిత సంబంధం ఉందంటూ విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్‌, త్రిషలు ఒకే కారులో కలిసి ఏజీఎస్‌ ఫ్యామిలీ వివాహ వేడుకకు హాజరయ్యారు. దీంతో వారి బంధంపై చర్చ మొదలైంది.

ట్రెండింగ్‌లో జననాయగన్‌, త్రిష..

త్రిష పుట్టిన రోజు నాడే ఎన్నికల ఫలితాలు వెల్లడికావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ.. త్రిష, తమిళనాడు ఎన్నికల ఫలితాలు, విజయ్‌ నటించిన ‘జననాయగన్‌’ మూవీ సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. విజయ్‌ సీఎం కావడం ఖాయమంటూ అభిమానులు ఈ సినిమా ట్రైలర్‌ను షేర్‌ చేస్తున్నారు. ‘జననాయగన్‌’ చిత్రంలో విజయ్‌ చెప్పే డైలాగులు.. ‘ది గోట్‌’ చిత్రంలోని పాటలో త్రిష... టీవీకే జెండా రంగు (పసుపు, ఎరుపు)లో ఉండే చీర ధరించి డ్యాన్స్‌ చేస్తున్న సన్నివేశం క్లిప్‌లను టీవీకే శ్రేణులు, విజయ్‌ అభిమానులు వైరల్‌ చేశారు. అలాగే... త్రిషకు శుభాకాంక్షలు వెల్లువెత్తడంతో ఆమె పేరు కూడా ఎక్స్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది.

Updated Date - May 05 , 2026 | 05:45 AM