Share News

స్వలింగ సంపర్కురాలికి టీఎంసీ రాజ్యసభ టికెట్‌

ABN , Publish Date - Mar 01 , 2026 | 03:29 AM

స్వలింగ సంపర్కురాలిగా తనను తాను ప్రకటించుకున్న సుప్రీంకోర్టు న్యాయవాది మేనక గురుస్వామికి పశ్చిమబెంగాల్‌ నుంచి అధికార టీఎంసీ రాజ్యసభ టికెట్‌ కేటాయించింది.

స్వలింగ సంపర్కురాలికి టీఎంసీ రాజ్యసభ టికెట్‌

  • మేనక గురుస్వామి పేరు ప్రకటన

కోల్‌కతా, ఫిబ్రవరి 28: స్వలింగ సంపర్కురాలిగా తనను తాను ప్రకటించుకున్న సుప్రీంకోర్టు న్యాయవాది మేనక గురుస్వామికి పశ్చిమబెంగాల్‌ నుంచి అధికార టీఎంసీ రాజ్యసభ టికెట్‌ కేటాయించింది. ఆమెతోపాటు ఆ రాష్ట్ర మంత్రి బాబుల్‌ సుప్రియో, బెంగాల్‌ మాజీ డీజీపీ రాజీవ్‌కుమార్‌, నటుడు కోయల్‌ మల్లిక్‌లను ఎంపిక చేసింది. ఈ నెల 16న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే పార్లమెంటులో అడుగుపెట్టే తొలి స్వలింగ సంపర్కురాలి (ఎల్జీబీటీక్యూ)గా మేనక గోస్వామి రికార్డు నెలకొల్పుతారు. స్వలింగ సంపర్కం నేరం కాదని 2018లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ కేసును వాదించిన న్యాయవాదుల్లో మేనక కూడా ఉన్నారు. న్యాయవాదిగా 1997లో కెరీర్‌ ప్రారంభించిన మేనక.. మొదట మాజీ అటార్నీ జనరల్‌ అశోక్‌ దేశాయ్‌ వద్ద జూనియర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో బీసీఎల్‌, హార్వర్డ్‌ వర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం చదివారు. 2019లో ఫారిన్‌ పాలసీ మేగజైన్‌ ప్రకటించిన ప్రపంచంలోని 100 మంది గొప్ప మేధావుల జాబితాలో మేనక చోటు సంపాదించారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ రోడ్స్‌ హౌస్‌లోని మిల్నర్‌ హాల్‌లో ఆమె చిత్రపటాన్ని అలంకరించారు. ఈ గౌరవం పొందిన మొదటి భారతీయురాలు, రెండో మహిళ మేనకనే కావటం విశేషం.

Updated Date - Mar 01 , 2026 | 03:31 AM