Share News

స్పామ్‌ కాల్స్‌కు ఇక చెక్‌

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:08 AM

లోన్‌ కావాలా? క్రెడిట్‌ కార్డు కావాలా? ఇన్సూరెన్స్‌ కావాలా? అంటూ తరచుగా వేధించే స్పామ్‌ కాల్స్‌కు ఇక అడ్డుకట్ట పడనుంది. ఇప్పటివరకు ఇలాంటి కాల్స్‌పై వినియోగదారులు ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకునే అవకాశం ఉండగా.. ఇకపై ఈ పరిస్థితి మారనుంది

స్పామ్‌ కాల్స్‌కు ఇక చెక్‌
AI

  • ఏఐ వ్యవస్థ ద్వారా గుర్తించి చర్యలు

తీసుకోవాలని టెల్కోలకు ట్రాయ్‌ ఆదేశం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: లోన్‌ కావాలా? క్రెడిట్‌ కార్డు కావాలా? ఇన్సూరెన్స్‌ కావాలా? అంటూ తరచుగా వేధించే స్పామ్‌ కాల్స్‌కు ఇక అడ్డుకట్ట పడనుంది. ఇప్పటివరకు ఇలాంటి కాల్స్‌పై వినియోగదారులు ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకునే అవకాశం ఉండగా.. ఇకపై ఈ పరిస్థితి మారనుంది. వినియోగదారులు ఫిర్యాదు చేయకపోయినా ఏఐ టెక్నాలజీ ద్వారా స్పామ్‌గా గుర్తించిన నంబర్లపై టెలికాం కంపెనీలు చర్యలు తీసుకోవాలంటూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) ఆదేశించింది. ఈ మేరకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. టెలికాం కమర్షియల్‌ కమ్యూనికేషన్స్‌ కస్టమర్‌ ప్రిఫరెన్స్‌ ద్వారా వీటిని నోటిఫై చేసింది. ఈ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి లేదా సంస్థ నుంచి వరుసగా అనుమానాస్పద కాల్స్‌ వస్తుంటే.. వాటి నమూనాలను ఏఐ వ్యవస్థలు పరిశీలించాలి. అవి స్పామ్‌గా అనుమానిస్తే ఆ సమాచారాన్ని టెలికాం కంపెనీలు పరస్పరం పంచుకోవాలి. అనంతరం ఆ వ్యక్తి లేదా సంస్థకు మరిన్ని నంబర్లు ఉన్నాయా? వాటి నుంచి గతంలో కూడా స్పామ్‌ కాల్స్‌ వెళ్లాయా? అన్నది పరిశీలించాలి. పది రోజుల్లో ఆ వ్యక్తి లేదా సంస్థ కేవైసీ అనుసంధానమైన ఐదు లేదా అంతకంటే ఎక్కువ నంబర్లను స్పామ్‌గా గుర్తిస్తే సదరు సంస్థపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటిసారి స్పామ్‌గా గుర్తిస్తే.. ఆ స్పామర్‌పై ఉన్న అన్ని సిమ్‌ కార్డులు, కనెక్షన్ల నుంచి అవుట్‌గోయింగ్‌ సేవలను 15 రోజులపాటు అన్ని నెట్‌వర్క్‌లు నిలిపివేస్తాయి. అయినా తరచూ అలాగే స్పామ్‌ కాల్స్‌ చేసినట్లు గుర్తిస్తే ఏడాదిపాటు బ్లాక్‌లిస్టులో పెడతారు. అయితే ఏ సంస్థ అయినా ఏటూపీ (అప్లికేషన్‌ టు పర్సన్‌) కాల్స్‌ చేయాలనుకుంటే మాత్రం ముందుగా టెలికాం కంపెనీలకు సమాచారం ఇస్తే వాటిని కొనసాగించే వీలుంటుంది.

Updated Date - Sep 30 , 2026 | 05:08 AM