విహారంలో విషాదం..!
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:03 AM
తమిళనాట విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. కోయంబత్తూరు జిల్లా వాల్పారై పర్యాటక ప్రాంతంలో ఘోర ప్రమాదం సంభవించింది.
పది మంది దుర్మరణం.. ఆరుగురికి తీవ్ర గాయాలు
తమిళనాట ఘటన.. మృతులంతా కేరళ వాసులే
చెన్నై, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): తమిళనాట విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. కోయంబత్తూరు జిల్లా వాల్పారై పర్యాటక ప్రాంతంలో ఘోర ప్రమాదం సంభవించింది. కేరళ పర్యాటకులతో వచ్చిన వ్యాన్ 800 అడుగుల ఎత్తు నుంచి గుంతలో పడడంతో పది మంది దుర్మరణం చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. కేరళలోని మలప్పురలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన 16 మంది ఉపాధ్యయుల బృందం ఈ నెల 15న కోయంబత్తూరు జిల్లా వాల్పారై పర్యాటక ప్రాంతానికి వచ్చింది. ఈ బృందం శుక్రవారం సాయంత్రం పొల్లాచ్చి మీదుగా కేరళకు తిరుగుముఖం పట్టింది. వాల్పారై కొండ 13వ మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న వ్యాన్.. హఠాత్తుగా అదుపుతప్పింది. రోడ్డుపక్కనున్న గోడను ఢీకొట్టి 800 అడుగుల ఎత్తు నుంచి కింద ఉన్న 11వ మలుపు వద్ద పడిపోయింది. పది మంది అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. వారందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.