ఒడిశాలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుక్రు లొంగుబాటు
ABN , Publish Date - Mar 25 , 2026 | 03:29 AM
ఒడిశాలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ఉన్న సుక్రు మంగళవారం కంధమాల్ జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయారు.
భువనేశ్వర్, మార్చి 24: ఒడిశాలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ఉన్న సుక్రు మంగళవారం కంధమాల్ జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. తన ఏకే-47 రైఫిల్‌ను కూడా సరెండర్ చేశారు. లొంగిపోయిన వారిలో సుక్రుతో పాటు మరో నలుగురు ఇతర మావోయిస్టు సభ్యులు ఉన్నారని ఒడిశా డీజీపీ వైబీ ఖురానియా వెల్లడించారు. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న సుక్రు తలపై రూ.55 లక్షల రివార్డు ఉందని తెలిపారు. మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన సుక్రు.. రాష్ట్రంలో క్రియాశీలంగా ఉన్న మిగతా మావోయిస్టుల్లో ఒకరని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న డైడ్‌లైన్ సమీపిస్తున్న క్రమంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. మరోవైపు ఇప్పటి వరకూ సుక్రు, అతని సహచరులు దాగివున్న కంధమాల్, రాయగడ, కలహండి జిల్లాల సరిహద్దు జంక్షన్ ప్రాంతంలో భద్రతా బలగాలు యాంటీ నక్సల్ ఆపరేషన్లను ముమ్మరం చేశాయని అధికారులు తెలిపారు.