అసెంబ్లీ ఆమోదించిన 3 పేర్ల నుంచే గవర్నర్ నియామకం!
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:09 AM
రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పేర్ల ఆధారంగా గవర్నర్‌ను నియమించాలని కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్.....
జస్టిస్ కురియన్ కమిటీ సిఫారసు
తమిళనాడు అసెంబ్లీలో నివేదిక
చెన్నై, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పేర్ల ఆధారంగా గవర్నర్‌ను నియమించాలని కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన నివేదికలో సిఫారసు చేసింది. గవర్నర్లకు పునరుద్ధరించలేని ఐదేళ్ల పదవీకాలాన్ని నిర్ణయించాలని సూచించింది. ఇందుకోసం ఆర్టికల్ 156ని సవరించాలని పేర్కొంది. శాసనసభలోని మొత్తం సభ్యుల్లో మెజారిటీ ఆమోదించిన మూడు పేర్లలో ఒకరిని రాష్ట్ర గవర్నర్‌గా నియమించడానికి రాష్ట్రపతి కట్టుబడి ఉండేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 155ని సవరించాలని కమిటీ సిఫారసు చేసింది. కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై గత ఏడాది తమిళనాడు ప్రభుత్వం జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ తొలి నివేదికను రెండు రోజుల క్రితం సీఎం స్టాలిన్‌కు అందించగా, దానిని స్టాలిన్ బుధవారం శాసనసభ ముందుంచారు. భాషా వివాదంపైన కూడా కమిటీ పలు సిఫారసులు చేసింది. ‘ఒక దేశం-ఒక భాష అనే భ్రమను వదిలేయాలి. ఎందుకంటే నిజమైన ఐక్యత భాషా ఏకరూపత నుంచి కాదు, భాషా సమానత్వం నుంచి పుడుతుంది. రాజ్యాంగబద్ధంగా భారతదేశ శాశ్వత అధికారిక భాషగా ఇంగ్లీషును చేర్చడానికి ఆర్టికల్ 343కు సవరణ చేపట్టాలి’ అని సిఫారసు చేసింది. రాష్ట్ర స్వయంప్రతిపత్తిని ఉల్లంఘించే అనాగరిక ఆర్టికల్ 347ను వదిలివేయాలని సూచించింది.