Share News

మమతకు మరో ఎదురుదెబ్బ!

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:54 AM

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి సొంత పార్టీ నేతల నుంచే ఎదురు దెబ్బలు తింటోన్న పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.

మమతకు మరో ఎదురుదెబ్బ!

  • టీఎంసీని వీడిన రాష్ట్ర అధ్యక్షురాలుచంద్రిమా భట్టాచార్య

కోల్‌కతా, జూలై 4: బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి సొంత పార్టీ నేతల నుంచే ఎదురు దెబ్బలు తింటోన్న పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య శనివారం రాజీనామా చేశారు. పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆమె తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ జూన్‌ 3న పార్టీలో అన్ని కమిటీలను రద్దు చేసి కొత్త వారిని నియమించారు. ఈ క్రమంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రతా బక్షిని తప్పించి ఆ స్థానంలో చంద్రిమా భట్టాచార్యను నియమించారు. సరిగ్గా నెల తిరిగేసరికి ఆమె ఆ పదవికి రాజీనామా చేశారు. నమ్మకం లేని చోట పనిచేయడం కష్టమని అందుకే తాను రాజీనామా చేసినట్లు చంద్రిమ విలేకరులకు చెప్పారు. కోల్‌కతాలోని టీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబల్స్‌ చేజిక్కించుకోవడానికి తానే కారణమని మమత నిందించారని చంద్రిమ పేర్కొన్నారు. కాగా చంద్రిమ రాజీనామా చేసిన వెంటనే బెంగాల్‌ అసెంబ్లీ వద్ద రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబల్స్‌ను కలుసుకొన్నారు. తాజా పరిణామాలపై మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెబల్స్‌ని ద్రోహులుగా అభివర్ణించారు. టీఎంసీ గుర్తు తనతోనే ఉంటుందన్నారు. ‘‘పార్టీ గుర్తు ఎక్కడికి పోదు... మీరు నన్ను ఆపాలంటే... నన్ను చంపాలి...’’ అని మమత పేర్కొన్నారు. ఇకపై రాష్ట్ర, జాతీయ స్థాయిలో పార్టీ బాధ్యతలు తానే చూస్తానని చెప్పారు. తన ఇంటి వద్ద ఉన్న పార్టీ కార్యాలయమే ఇకపై పార్టీ ప్రధాన కార్యాలయంగా ఉంటుందని స్పష్టం చేశారు.

Updated Date - Jul 05 , 2026 | 05:54 AM