CM Mamata Banerjee: బెంగాల్‌లో ఐ-ప్యాక్ రచ్చ
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:35 AM
రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలపై పశ్చిమబెంగాల్‌లో రచ్చ కొనసాగుతోంది.
టీఎంసీ చీఫ్‌గా వెళ్లా.. ఐ-ప్యాక్ పార్టీకి సలహా సంస్థ
రాజకీయ కక్షతోనే ఈడీ దాడి: బెంగాల్ సీఎం మమత
మమత, పోలీసులపై సీబీఐతో దర్యాప్తు జరపాలి
కలకత్తా హైకోర్టులో ఈడీ రిట్ పిటిషన్
ఈడీ మా సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా చూడండి.. హైకోర్టులో పిటిషన్ వేసిన టీఎంసీ
కోర్టులో రసాభాస.. విచారణను 14కు వాయిదా
న్యూఢిల్లీ/కోల్‌కతా, జనవరి 9: రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలపై పశ్చిమబెంగాల్‌లో రచ్చ కొనసాగుతోంది. మమతకు వ్యతిరేకంగా ఈడీ, దర్యాప్తు సంస్థ సోదాలను సవాలు చేస్తూ టీఎంసీ.. కలకత్తా హైకోర్టును ఆశ్రయించాయి. ఇరుపక్షాలు కోర్టును ఆశ్రయించగా.. అక్కడా గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి, పిటిషన్ల విచారణను ఈ నెల 14కు వాయిదా వేశారు. బొగ్గు అక్రమ రవా ణా కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఐ-ప్యాక్ డైరెక్టర్ జైన్ ఇల్లు, సంస్థ కార్యాలయాల్లో గురువారం ఈడీ తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీలను వ్యతిరేకిస్తూ టీఎంసీ అధ్యక్షురాలు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. శుక్రవారం దక్షిణ కోల్‌కతాలో ఆమె ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇందులో రాష్ట్ర మంత్రులు, టీఎంసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ ని 10 కి.మీ. మేర నిర్వహించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. టీఎంసీ అంతర్గత వ్యూహాలను చోరీ చేసేందుకు బీజేపీ సర్కారు ఈడీని వాడుకుంటోందని, రాజకీయ కక్షతోనే దాడి చేయిస్తోందని ఆరోపించారు. ఈడీ సోదాలు జరుగుతున్న సమయంలో తాను ఐ-ప్యాక్ కార్యాలయానికి, ప్రతీక్ జైన్ ఇంటికి వెళ్లడాన్ని సమర్థించుకున్నారు. ‘‘నేను నిన్న ఏం చేసినా అది టీఎంసీ అధ్యక్షురాలిగానే చేశా. సీఎంగా కాదు. నేనేమీ చట్టవిరుద్ధంగా ప్రవర్తించలేదు’’ అని మమత స్పష్టం చేశారు. ఐ-ప్యాక్ తమ పార్టీకి రాజకీయ సలహా సంస్థ అని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు అన్ని సంస్థలనూ తన గుప్పిట్లో పెట్టుకుందని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర, హరియాణా, బిహార్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ బలవంతంగా అధికారాన్ని చేజిక్కించుకుందని ఆరోపించారు. బెంగాల్‌లో కూడా అలాగే గద్దెనెక్కాలని చూస్తున్నారా? అని మమత నిలదీశారు. ఈసీ సాయంతో మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచారని.. ఇప్పుడు ఓటర్ల జాబితా సవరణ పేరుతో నిజమైన ఓటర్లను కూడా తొలగించి బెంగాల్‌లోనూ అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు.
మమతపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి: ఈడీ
మనీలాండరింగ్ కేసులో ఐ-ప్యాక్ కార్యాలయాల్లో సోదాలు జరుపుతుండగా.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వచ్చి కీలక ఆధారాలను తీసుకెళ్లిపోయారని, ఆమెపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఈడీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. తమ విధులకు ఆటంకం కలిగించిన సీఎం మమత, సీనియర్ పోలీసు అధికారులు, ఇతరులపై సీబీఐతో విచారణ జరిపించాలని అభ్యర్థిస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. సోదాలు చేసిన ప్రాంతాల నుంచి తాము సేకరించిన ఆధారాలను మమత, ఆమె అనుచరులు బలవంతంగా తీసుకెళ్లిపోయారని.. వాటిని తక్షణమే సీజ్ చేసి తమకు అప్పగించేలా చూడాలని ఈడీ కోరింది. కాగా, టీఎంసీ కూడా ఈడీకి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించింది. ఐ-ప్యాక్ కార్యాలయాల్లో సోదాల సందర్భంగా సేకరించిన సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా ఈడీని అడ్డుకోవాలని కోరుతూ రిట్ పిటిషన్ వేసింది. ఈడీ, టీఎంసీ పిటిషన్ల విచారణ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ పిటిషన్లు జస్టిస్ సువ్ర ఘోష్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. అయితే, కోర్టు గది తీవ్ర రసాభాసగా మారిపోవడంతో జస్టిస్ ఘోష్ విచారణను ఈ నెల 14కు వాయిదా వేశారు. పిటిషన్లకు సంబంధం లేని న్యాయవాదులు కూడా పదేపదే విజ్ఞప్తులు చేస్తూ గందరగోళం సృష్టించడంతో ఆమె తన సీటు నుంచి లేచి వెళ్లిపోయారు. కాగా, తమ పిటిషన్‌పై తక్షణమే విచారణ చేపట్టాలని ఈడీ తరఫు న్యాయవాది హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ సుజోయ్ పాల్‌ను కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. జస్టిస్ ఘోష్ ఆదేశాల్లో తాను జోక్యం చేసుకోలేనని తేల్చిచెప్పారు. మరోవైపు టీఎంసీ అధ్యక్షురాలి హోదాలో మమత శుక్రవారం ఈడీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోల్‌కతా, బిధాన్‌నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ డ్రామాలు మమతకు అలవాటే: బీజేపీ
ఈడీ తనిఖీల సమయంలో సీఎం మమత ప్రవర్తించిన తీరును బీజేపీ తప్పుపట్టింది. తనిఖీలు చేస్తున్న ఈడీ అధికారుల నుంచి పత్రాలను లాక్కెళ్లిపోవడం చూస్తుంటే ఆమెపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ప్రతి ఎన్నిక ముందు ఆమె ఇలాంటి డ్రామాలే చేస్తుంటారని ఎద్దేవా చేశారు. కోల్‌కతాలో ర్యాలీ కూడా డ్రామా అని అన్నారు.
ఢిల్లీలో టీఎంసీ ఎంపీల నిరసన
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు శుక్రవారం ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మహువా మొయిత్రా, శతాబ్ది రాయ్, కీర్తి ఆజాద్, డెరెక్ ఓబ్రెయిన్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. కోల్‌కతాలోని ఐ-ప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలకు వ్యతిరేకంగా ఎంపీలు, నేతలు నినాదాలు చేశారు. రాజకీయ కక్షతోనే ఈడీని ఆయుధంగా ఉయోగిస్తున్నారంటూ అమిత్ షాపై విమర్శలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎంపీలు నినాదాలు చేయడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. పోలీసుల తీరును ఎంపీలు ఖండించారు.