కొరియన్ గేమ్‌కు బానిసలై.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య
ABN , Publish Date - Feb 05 , 2026 | 03:52 AM
విద్యార్థులు, యువత ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలుగా మారిపోతున్నారు. మొబైల్ ఫోన్లలో ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతూ.. బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా గంటల తరబడి ఫోన్లలోనే గడిపేస్తున్నారు.
9వ అంతస్తు నుంచి దూకేసిన వైనం
16, 14, 12 ఏళ్ల బాలికల అఘాయిత్యం
‘సారీ.. నాన్నా..’ అంటూ సూసైడ్ నోట్
కరోనా సమయంలో ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటై రెండేళ్లుగా స్కూల్‌కి కూడా వెళ్లని బాలికలు
మందలించి, ఫోన్ తీసేసుకున్న తల్లిదండ్రులు
మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న తోబుట్టువులు.. ఘజియాబాద్‌లో ఘటన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: విద్యార్థులు, యువత ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలుగా మారిపోతున్నారు. మొబైల్ ఫోన్లలో ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతూ.. బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా గంటల తరబడి ఫోన్లలోనే గడిపేస్తున్నారు. తల్లిదండ్రులు వారించినా తీరు మార్చుకోవడం లేదు. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసలైన వారికి ఫోన్ అందుబాటులో లేకుండా చేస్తే.. మానసికంగా కుంగిపోతున్నారు. బలవన్మరణాలకూ పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి దారుణమే ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. కొరియా ఆన్‌లైన్ గేమ్‌కు బానిసలై ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు వారికి ఫోన్ ఇవ్వకపోవడం వల్ల మనస్తాపానికి గురై 9వ అంతస్తు నుంచి దూకేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ రెసిడెన్షియల్ టౌన్‌షి్‌పలో నివసిస్తున్న చేతన్‌కుమార్‌కు ఇద్దరు భార్యలు. ఐదుగురు సంతానం. వారిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు నిషిక(16), ప్రాచి(14), పాఖి(12)లకు కరోనా సమయంలో మొబైల్ ఫోన్ అలవాటైంది. తర్వాత ఆన్‌లైన్ గేమ్స్ ఆడడం వ్యసనంగా మారింది. చదువును కూడా పక్కనపెట్టేశారు. బడి మానేశారు. వారి ప్రవర్తనపై ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. ఫోన్ వాడకం తగ్గించాలంటూ పిల్లలను మందలించేవారు. వారికి ఫోన్ అందుబాటులో లేకుండా చేశారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అక్కాచెల్లెళ్లు ముగ్గురూ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. చేతన్‌కుమార్ ఉంటున్న ఫ్లాట్ 9వ అంతస్తులో ఉంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో అక్కాచెల్లెళ్లు బాల్కనీలోకి వెళ్లి, ఒకరి తర్వాత ఒకరు కిందకి దూకేశారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆ బాలికలు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, గేమ్ టాస్క్‌లో భాగంగానే వారు ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సూసైడ్ నోట్ స్వాధీనం..
అక్కాచెల్లెళ్లు ముగ్గురు ఉండే గదిలో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ‘ఈ డైరీలో ఉన్న సమాచారం మొత్తాన్ని చదవండి. ఎందుకంటే అదంతా నిజం. ఇప్పుడే చదవండి. రియల్లీ సారీ, సారీ నాన్నా’ అని వారు అందులో రాశారు. ఆ డైరీలో తాము కొరియా సంస్కృతిని ప్రేమిస్తున్నట్లు బాలికలు రాసుకున్నారు. కాగా, ఆ ముగ్గురూ కొరియన్ గేమ్‌కు బానిసలైనట్లు ప్రాథమికంగా గుర్తించామనిఏసీపీ అతుల్‌కుమార్ చెప్పారు. కొరియన్ గేమ్‌ను ముగ్గురూ కలిసే ఆడేవారని పోలీసులు వెల్లడించారు. అయితే, టాస్క్ గేమ్ వల్లే చనిపోయారా అనేది తేలాల్సి ఉందన్నారు. తన కుమార్తెలు ఆడే కొరియన్ గేమ్‌కు టాస్క్ ఉందని తనకు తెలియదని తండ్రి చేతన్‌కుమార్ వాపోయారు. ‘‘రెండున్నరేళ్లుగా వారు ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్నారు. ఎప్పుడూ ఫోన్లు పట్టుకొని గదిలోనే ఉండేవారు’’ అని తెలిపారు. కుమార్తెలు తరచూ తాము కొరియా వెళ్తామని చెప్పేవారన్నారు.