Share News

PG Medical Seats Remain Vacant: వేలల్లో పీజీ మెడికల్‌ సీట్లు ఖాళీ

ABN , Publish Date - Jan 20 , 2026 | 01:51 AM

దేశవ్యాప్తంగా పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ సీట్లను ప్రభుత్వం పెంచుకుంటూ పోతూ ఉంటే.. మరోపక్క ప్రవేశాలు లేక అవి వేల సంఖ్యలో మిగిలిపోతున్నాయి.

PG Medical Seats Remain Vacant: వేలల్లో పీజీ మెడికల్‌ సీట్లు ఖాళీ

  • 2025లో దేశవ్యాప్తంగా 17 వేలకుపైగా మిగులు

  • జీరో పర్సంటైల్‌కు కటాఫ్‌ మార్కులు.. మైనస్‌ 40 వచ్చినా సీటు

  • ప్రైవేట్‌ కాలేజీల కోసమే కటాఫ్‌ తగ్గింపు అంటూ విమర్శలు

న్యూఢిల్లీ, జనవరి 19: దేశవ్యాప్తంగా పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ సీట్లను ప్రభుత్వం పెంచుకుంటూ పోతూ ఉంటే.. మరోపక్క ప్రవేశాలు లేక అవి వేల సంఖ్యలో మిగిలిపోతున్నాయి. 2020 నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ(ఎంసీసీ) డేటా ప్రకారం.. తొలి రౌండ్‌ కౌన్సెలింగ్‌ పూర్తయ్యేనాటికి ఆలిండియా స్థాయిలో 2021లో 11,629 సీట్లు ఖాళీగా ఉంటే 2025 (ప్రస్తుతం కొనసాగుతున్న ప్రవేశాల రౌండ్‌) నాటికి 17,619 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. పార్లమెంట్‌లో ప్రభుత్వం తెలిపిన లెక్కల ప్రకారం.. 2020లో 40,858 పీజీ మెడికల్‌ సీట్లు ఉంటే 2025 నాటికి వాటి సంఖ్య 62,584కు పెరిగింది. ఐదేళ్లలో మరో 75 వేల యూజీ, పీజీ సీట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రెండో కౌన్సెలింగ్‌ నాటికి దాదాపు 18 వేల సీట్లు మిగిలిపోవడంతో కొన్ని కేటగిరీల్లో కటాఫ్‌ మార్కులను సున్నా పర్సంటైల్‌కు తగ్గించేశారు. జనరల్‌ కేటగిరీలో 7 పర్సంటైల్‌, జనరల్‌ కోటా దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ కోటాలకు 5 పర్సంటైల్‌, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలకు 0 పర్సంటైల్‌ కటా్‌ఫగా నిర్ణయించారు. దీనినిబట్టి మైనస్‌ 40 మార్కులు వచ్చినా పీజీ మెడికల్‌ సీటుకు అర్హత సాధిస్తారు. ఇలా అర్హత మార్కులను తగ్గించడం ప్రైవేట్‌ కాలేజీల్లో సీట్లు నింపడానికే అని ఫైమా డాక్టర్ల సంఘం సహ వ్యవస్థాపకుడు డాక్టర్‌ రోహన్‌ కుమార్‌ విమర్శించారు. ప్రతిభ ఉన్నా ప్రైవేట్‌ కళాశాలల్లో ఫీజులు చెల్లించలేక కొందరు సీట్లు పొందలేకపోతున్నారని, ఆర్థిక స్థోమత ఉండి తక్కువ మార్కులతో కొందరు సీటు పొందగలుగుతున్నారని ఇది మెరిట్‌ విద్యార్థులకు అన్యాయమేనని ఆయన చెప్పారు. ఎంసీసీ డేటా ఆధారంగా చూస్తే ఎక్కువగా మిగిలిపోతున్న సీట్లు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోనే ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే ప్రైవేట్‌ కాలేజీలు, ఆస్పత్రుల్లో అత్యధిక పీజీ సీట్లున్నాయి. మౌలిక సదుపాయాలు సరిగా లేకపోయినా రూ. కోట్లలో ఫీజులు వసూలు చేస్తుండటంతో ఆ కాలేజీలను తొలి చాయి్‌సగా విద్యార్థులు ఎంచుకోవడంలేదు. ఇక మంచి ర్యాంకులు సాధించిన వారు జనరల్‌ మెడిసిన్‌, రేడియో డయాగ్నోసిస్‌ సబ్జెక్టులనే ఎంచుకోవడం కూడా సీట్లు మిగిలిపోవడానికి ఓ కారణం.

Updated Date - Jan 20 , 2026 | 01:51 AM