కృత్రిమ మేధలో.. తెలుగు యోధ
ABN , Publish Date - Jan 30 , 2026 | 03:18 AM
అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు! జరిగిపోయాక గుర్తించాల్సిన అవసరం లేదు.. అని ఒక సినిమా డైలాగ్ ఉంది! అలాంటి అద్భుతం ఒకటి అమెరికాలో జరిగింది.
దిగ్గజ ఏఐ సంస్థలు ఉపయోగిస్తున్న ‘పైటార్చ్’అభివృద్ధిలో సౌమిత్ చింతల కీలక పాత్ర
ఏఐలో రిసెర్చ్‌తో మెటాలో ఉపాధ్యక్షుడి స్థాయికి.. ఇప్పుడు సంస్థ నుంచి బయటకు
మెషీన్ థింకింగ్ ల్యాబ్స్ స్టార్టప్ సంస్థలో ప్రధాన సాంకేతిక అధికారిగా కొత్త ప్రస్థానం
అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు! జరిగిపోయాక గుర్తించాల్సిన అవసరం లేదు.. అని ఒక సినిమా డైలాగ్ ఉంది! అలాంటి అద్భుతం ఒకటి అమెరికాలో జరిగింది. ఆ అద్భుతం వెనుక ఉన్న వ్యక్తి పేరు.. సౌమిత్ చింతల (37)! ఐటీ రంగంలో మన తెలుగువాళ్లు చాలామంది.. పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈవోలుగా, సీటీవోలుగా.. ఇలా కీలకస్థానాల్లో ఉన్న సంగతి తెలిసిందే! కానీ.. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న కృత్రిమ మేధ రంగంలో సత్తా చాటుతున్న తెలుగు తేజం.. సౌమిత్ చింతల. కంప్యూటర్‌లో ఏదైనా డాక్యుమెంట్ తయారుచేయడానికి ‘మైక్రోసాఫ్ట్ వర్డ్’ ఎంత కీలకమో.. డిజైనర్లకు ఫొటోషాప్ ఎంత ముఖ్యమో.. అలా కృత్రిమమేధ అభివృద్ధికి ‘మెషీన్ లెర్నింగ్’ అంత ముఖ్యం. ఆ మెషీన్‌లెర్నింగ్‌కు సంబంధించి అత్యంతకీలకమైన టూల్.. ‘పైటార్చ్’. దాన్ని అభివృద్ధి చేసిన బృందానికి నేతృత్వం వహించిన వ్యక్తి సౌమిత్ చింతల! ‘మెటా’లో దాదాపు 11 సంవత్సరాలపాటు పలు స్థాయుల్లో పనిచేసి.. ఆ సంస్థ ఏఐ రిసెర్చ్‌లో కీలకంగా వ్యవహరించిన సౌమిత్ గత ఏడాది నవంబరులో హఠాత్తుగా ‘థింకింగ్ మెషీన్స్ ల్యాబ్’ అనే స్టార్ట్‌పలో చేరినప్పుడు యూఎ్‌సలోని దిగ్గజ కంపెనీలు సైతం ఒక్కసారి ఆసక్తిగా ఈ పరిణామాన్ని గమనించాయి!
ఆ కథేంటంటే..
ఏఐ అనగానే మనందరికీ గుర్తొచ్చే పేరు.. చాట్‌జీపీటీ. దాన్ని అభివృద్ధి చేసిన సంస్థ ‘ఓపెన్ ఏఐ’. ఆ సంస్థ నుంచి బయటకు వచ్చిన నలుగురు కీలక వ్యక్తులు దానికి పోటీగా కొన్నాళ్ల క్రితం ‘థింకింగ్ మెషీన్స్ ల్యాబ్’ అనే స్టార్ట్‌పను ప్రారంభించారు. కానీ.. కొద్దికాలంలోనే ఆ నలుగురిలోంచి ఇద్దరు (సీనియర్ ఏఐ సైంటిస్ట్ ల్యూక్‌మెట్జ్, రిసెర్చ్ సైంటిస్ట్ శాం షోన్‌హోల్జ్) మళ్లీ ఓపెన్‌ఏఐకి వెళ్లిపోయారు. వారి తర్వాత.. సంస్థకు ఆయువుపట్టులాంటి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ బారెట్ జోఫ్ కూడా ఓపెన్ ఏఐకి వెళ్లిపోయారు. ఆ సమయంలో.. బారెట్ జోఫ్ స్థానంలో సీటీవో బాధ్యతలను అత్యంత సమర్థంగా నిర్వహించగలిగే సత్తా ఉన్న ఏకైక వ్యక్తి మన సౌమితేనని ఆమె భావించి, ఆయనను ఆ పోస్టులో నియమించారు. నిజానికి ‘ఓపెన్ ఏఐ’కి పోటీగా మిరా మురాటీ థింకింగ్ మెషీన్స్ ల్యాబ్‌ను ప్రారంభించాక.. దాని అభివృద్ధి చూసి, ఆ స్టార్ట్‌పను బిలియన్ డాలర్లపెట్టి కొనేయాలని మెటా చీఫ్ జుకెర్‌బర్గ్ విశ్వప్రయత్నం చేశారు. ఆ సంస్థ నుంచి ఉద్యోగులను తన సంస్థలోకి లాగేసే ప్రయత్నాలూ చేశారు. కానీ.. మిరా మురాటీ మెటాలో కృత్రిమ మేధకు అభివృద్ధికి సంబంధించి కీలకస్థానంలో ఉన్న సౌమిత్ చింతలనే తన కంపెనీలోకి తెచ్చుకోగలిగారు.
లెక్కల్లో వీక్.. కానీ..
అమెరికాలోని టెక్ సర్కిల్స్‌లో కీలకవ్యక్తిగా మారిన సౌమిత్ చింతల.. పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. చదువుకున్నది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో. చిన్నప్పటి నుంచీ లెక్కలంటే ఆయనకు చాలా భయం. ఇక్కడ స్కూలింగ్ పూర్తయ్యాక.. వెల్లూరు(తమిళనాడు)లోని వీఐటీలో బీటెక్ చేశారు. అనంతరం ఆయన అమెరికాలో మాస్టర్స్ చేయాలని భావించి 12 యూనివర్సిటీలకు దరఖాస్తు చేశారు. జీఆర్‌ఈలో మంచి స్కోరే వచ్చినా.. సౌమిత్‌కు ఆ 12 యూనివర్సిటీల్లో ఒక్కదాంట్లో కూడా ప్రవేశం దొరకలేదు. అయినా సౌమిత్ పట్టువదలకుండా ప్రయత్నించి జే-1 వీసాపై కార్నెగీమెలన్ యూనివర్సిటీలో చేరారు. అక్కడికి వెళ్లాక మరోసారి 15 యూనివర్సిటీల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేస్తే.. యూనివర్సిటీ ఆఫ్ సౌత్‌కాలిఫోర్నియాలో, న్యూయార్క్ యూనివర్సిటీలో అడ్మిషన్లు దొరికాయి. చివరికి 2010లో న్యూయార్క్ వర్సిటీలో చేరారు. మాస్టర్స్ పూర్తిచేశాక కూడా సౌమిత్ ప్రస్థానం అంత సులువుగా ఏమీ సాగలేదు. ఉద్యోగం కోసం చేసిన ప్రతి దరఖాస్తూ బుట్దదాఖలైంది. గూగుల్ డీప్‌మైండ్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తే.. మూడుసార్లు తిరస్కారానికి గురైంది. ఈ క్రమంలోనే ఆయన.. 2011-2012 నడుమ మొబైల్ పరికరాల కోసం.. అత్యంత వేగంగా పనిచేసే ఏఐ ఇన్‌ఫరెన్స్ ఇంజన్స్‌ను సౌమిత్ అభివృద్ధి చేశారు. అంటే.. అప్పటికే అందుబాటులో ఉన్న ఏఐ టెక్నాలజీని (ట్రెయిన్డ్ మోడల్‌ని) మొబైల్‌ఫోన్ స్థాయి పరికరాల్లో పనిచేసేలా చేయగలిగారు. అది అప్పటి మెటా చీఫ్ ఏఐ సైంటిస్ట్ యాన్‌లెకున్ (ఈయన కూడా ఇటీవలే మెటా నుంచి బయటికి వచ్చేశారు) దృష్టిని ఆకర్షించింది. ఆయన ద్వారా 2014 ఫేస్‌బుక్‌లో చేరి ఏఐ రిసెర్చ్ చేరిన సౌమిత్.. అక్కడ నెగ్గుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. అక్కడి సీనియర్ ఇంజనీర్లు కూడా పరిష్కరించలేకపోయిన అత్యంత క్లిష్టమైన సమస్యను పరిష్కరించడం ద్వారా ఆయన అక్కడ తన సత్తా గట్టిగా చాటారు. వెంటనే ఫేస్‌బుక్ ఆయన్ను ముగ్గురు సభ్యుల టీమ్‌కు లీడర్‌ని చేసింది. అప్పటికి ఫేస్‌బుక్ సంస్థ టార్చ్7 అనే మెషీన్ లాంగ్వేజ్ ఫ్రేమ్‌వర్క్‌పై పనిచేస్తోంది. ఆ టూల్‌ని ‘లువా’ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో రూపొందించారు. కానీ, సౌమిత్ తన టీమ్‌లోని మిగతా ముగ్గురితో కలిసి.. పైథాన్ (ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్)లో దాన్ని మెరుగుపరిచి ‘పైటార్చ్’ (పైథాన్+టార్చ్)ను సృష్టించారు. 2016లో అది అందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఓపెన్‌ఏఐ,గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు సైతం చేస్తున్న అత్యంత అధునాతన ఏఐ పరిశోధనలకు అది వెన్నెముక. మెటా వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలో ఉండి ఇన్ని అద్భుతాలు సాధించి, ఆ సంస్థ వైస్‌ప్రెసిడెంట్ స్థాయికి చేరిన సౌమిత్.. థింకింగ్ మెషీన్స్‌ల్యాబ్ వంటి స్టార్ట్‌పలో చేరడమేంటని చాలా మంది అనుకోవచ్చు! దీనికి సౌమిత్ ఏమంటారో తెలుసా?.. ‘‘ఏఐ పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన స్థానాన్ని సంపాదించడం సులభం కాదు. కానీ.. మెటాను వదిలి బయటకు వచ్చి మరే ప్రయత్నమూ చేయలేదన్న పశ్చాత్తాపంతో జీవించకూడదు. అందుకే మెటాను వదిలిపెడుతున్నా’’ అని సౌమిత్ పేర్కొన్నారు! ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లను ఎదుర్కొనే ఆ మసస్తత్వమే ఆయన్ను ఆ స్థానానికి చేర్చిందంటే అతిశయోక్తి కాదు!!
- సెంట్రల్ డెస్క్