Share News

బహ్రెయిన్‌ నుంచి స్వదేశానికి తెలుగు పాస్టర్లు

ABN , Publish Date - Mar 11 , 2026 | 03:52 AM

క్రైౖస్తవ ధార్మిక సదస్సులో పాల్గొనేందుకు బహ్రెయిన్‌కు వచ్చి ఇరాన్‌ యుద్ధం కారణంగా గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తెలుగు పాస్టర్లు ఏపీ సీఎం చంద్రబాబు జోక్యంతో ఎట్టకేలకు స్వదేశానికి చేరుకోనున్నారు.

బహ్రెయిన్‌ నుంచి స్వదేశానికి తెలుగు పాస్టర్లు

  • పశ్చిమాసియాలో యుద్ధంతో 10 రోజులుగా ఎదురు చూపు

  • ఫలించిన ఏపీ సీఎం బాబు జోక్యం.. నేడు సొంత ప్రాంతాలకు రాక

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

క్రైౖస్తవ ధార్మిక సదస్సులో పాల్గొనేందుకు బహ్రెయిన్‌కు వచ్చి ఇరాన్‌ యుద్ధం కారణంగా గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తెలుగు పాస్టర్లు ఏపీ సీఎం చంద్రబాబు జోక్యంతో ఎట్టకేలకు స్వదేశానికి చేరుకోనున్నారు. ఇరాన్‌ యుద్ధం కారణంగా బహ్రెయిన్‌ గగనతలం మూసివేయడంతో గత 10 రోజులుగా వీరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమను స్వదేశానికి చేర్చాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. వీరి విన్నపంపై స్పందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు మంగళవారం ఫలించాయి. ఫలితంగా బహ్రెయిన్‌ నుంచి రోడ్డు మార్గంలో సౌదీ అరేబియాకు చేరుకుని, అక్కడ నుంచి మంగళవారం కేరళలోని కొచ్చికి బయలుదేరారు. బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు. బహ్రెయిన్‌లో పాస్టర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిసిన వెంటనే చంద్రబాబు స్పందించారు. పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడుతోపాటు ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ సతీశ్‌తో మాట్లాడారు. అదేవిధంగా ఏపీ ఎన్నార్టీ అధికారులు, టీడీపీ గల్ఫ్‌ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణలతోనూ చర్చించారు. అనంతరం.. సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లలోని టీడీపీ నేతల సమన్వయంతో పాస్టర్లను స్వదేశానికి తీసుకువచ్చే కార్యక్రమం ప్రారంభమైంది.

ఒక్క రోజు ఆగడంతో..

బహ్రెయిన్‌లో గత నెలలో జరిగిన క్రైస్తవ ధార్మిక సదస్సులో మనదేశం సహా ఇతర గల్ఫ్‌ దేశాల నుంచి 128 మంది పాస్టర్లు పాల్గొన్నారు. వీరిలో సగం మంది సదస్సు ముగిసిన అనంతరం ఫిబ్రవరి 27న తమ తమ దేశాలకు వెళ్లిపోయారు. కానీ, మిగిలిన వారు మరుసటి రోజు వెళ్దామని ఆగిపోయారు. ఇదే వీరికి ఇబ్బందులు తీసుకువచ్చింది. ఫిబ్రవరి 28న బహ్రెయిన్‌లోని విమానాశ్రయానికి చేరుకుని బోర్డింగ్‌ పాసులు పొంది ఇమ్మిగ్రేషన్‌ తనిఖీలను కూడా పూర్తి చేసుకున్నారు. కానీ, ఇంతలోనే ఇరాన్‌ క్షిపణి దాడులు మొదలయ్యాయి. బహ్రెయిన్‌ తన గగనతలాన్ని మూసివేసింది.

Updated Date - Mar 11 , 2026 | 03:52 AM