జనన ధ్రువీకరణే జటిలం
ABN , Publish Date - May 25 , 2026 | 04:07 AM
తన బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం పొందడంలో జాప్యం చేసినందుకు దేశం కాని దేశంలో అగమ్యగోచర పరిస్థితులు ఎదుర్కొన్న ఓ కుటుంబం ఎట్టకేలకు స్వదేశానికి చేరింది...
బర్త్ సర్టిఫికెట్ లేక గల్ఫ్‌లో నరకం చూసిన తెలుగు కుటుంబం
ఎట్టకేలకు స్వదేశానికి చేరిన తల్లీబిడ్డలు
ఆదుకున్న ‘తెలుగు కళా సమితి’
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
తన బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం పొందడంలో జాప్యం చేసినందుకు దేశం కాని దేశంలో అగమ్యగోచర పరిస్థితులు ఎదుర్కొన్న ఓ కుటుంబం ఎట్టకేలకు స్వదేశానికి చేరింది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి వ్యాపార నిమిత్తం బహ్రెయిన్‌కు వెళ్లాడు. తొమ్మిదేళ్ల క్రితం తన భార్య, కూతురిని విజిట్ వీసాపై అక్కడకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత 2018లో ఆ దంపతులకు మరో కూతురు జన్మించింది. అయితే ఆ పాప పుట్టుక వివరాలను వారు అక్కడి భారత ఎంబసీలో నమోదు చేయలేదు. కొంతకాలానికి ఆ వ్యక్తి వ్యాపారంలో నష్టాలు వచ్చి ఆర్థికంగా చిక్కులో పడ్డాడు. ఇంటి అద్దె కూడా చెల్లించకపోవడంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలియని సదరు వ్యక్తి, వేరే కేసులో ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. అప్పటికే అతడిపై ఫిర్యాదు ఉండడంతో పోలీసులు అతన్ని భారతదేశానికి డిపోర్ట్(దేశ బహిష్కరణ) చేశారు. గల్ఫ్ నిబంధనల ప్రకారం ఒకసారి డిపోర్ట్ అయిన వ్యక్తి తిరిగి ఆ దేశంలోకి అడుగుపెట్టలేడు. దీంతో దేశం కాని దేశంలో భార్య, ఇద్దరు పిల్లలు ఒంటరైపోయారు. ఉండడానికి నీడ, తినడానికి తిండి లేక ఆ తల్లీబిడ్డలు నరకం చూశారు. ఎలాగోలా స్వదేశానికి వచ్చేద్దామనుకుంటే చట్టాలు అడ్డొచ్చాయి. బహ్రెయిన్‌లో పుట్టిన చిన్నారికి జనన ధ్రువీకరణ పత్రం లేదు. దీంతో అటు బహ్రెయిన్ ప్రభుత్వం గానీ, ఇటు భారత చట్టాలు గానీ ఆ పాపను తమ పౌరురాలిగా గుర్తించలేదు. ఈ క్లిష్ట సమయంలో బహ్రెయిన్‌లోని తెలుగు ప్రవాసీ సంఘమైన ‘తెలుగు కళా సమితి’ ఆ కుటుంబానికి అండగా నిలిచింది. వారికి ఆశ్రయం కల్పించడంతో పాటు భారత ఎంబసీ అధికారులతో మాట్లాడి దిల్లీ నుంచి ప్రత్యేక అనుమతులు వచ్చేలా చేసింది. వీసా గడువు ముగిసినందుకు పడిన జరిమానాను కూడా ఎంబసీ చెల్లించింది. ఎట్టకేలకు అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తయి శనివారం ఆ తల్లీబిడ్డలు సురక్షితంగా మాతృభూమికు చేరుకున్నారు.