జూన్ 25 నుంచి రాష్ట్రంలో ‘సర్’
ABN , Publish Date - May 15 , 2026 | 04:02 AM
మూడో దశలో ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది..
జూలై 24 దాకా ఓటర్ల వివరాల సేకరణ.. అక్టోబరు 1న ఓటర్ల తుది జాబితా ప్రచురణ
న్యూఢిల్లీ, మే 14 (ఆంధ్రజ్యోతి): మూడో దశలో ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జరుగుతున్న జనా భా లెక్కల ప్రక్రియకు వినియోగిస్తున్న సిబ్బందితో నే సర్ ప్రక్రియనూ సమాంతరంగా నిర్వహించేలా తేదీలను ఖరారు చేసినట్లు గురువారం వెల్లడించింది. మూడో దశ పూర్తయితే జమ్మూకశ్మీర్, లద్దాక్, హిమాచల్‌ప్రదేశ్ మినహా దేశమంతా సర్ ప్రక్రియ ముగిసినట్లని ఈసీ వెల్లడించింది. ఆ మూడు రాష్ట్రా లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండో విడత జనాభా లెక్కల ప్రక్రియ ముగిశాక, అలాగే, హిమపాతం తగ్గి వాతావరణం అనుకూలించాక సర్ ప్రక్రియకు షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపింది. మూడో దశను ఈ నెల 30న ప్రారంభించి.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ఒడిసా, మిజోరం, సిక్కిం, మణిపూర్, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, హరియాణా, చండీగఢ్, పంజాబ్, మేఘాలయ, మహారాష్ట్ర, ఝార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, దాదర్ అండ్ నాగర్ హవేలీ-డామన్ డయ్యూలలో దశలవారీగా ప్రక్రియను మొ దలెట్టనున్నట్లు తెలిపింది. మూడో దశలో 3,94,541 మంది బీఎల్‌వోలు(బూత్ లెవల్ అధికారులు) ఇంటింటికీ వెళ్లి 36,73,87,831 మంది ఓటర్ల వివరాలను కచ్చితత్వంతో పరిశీలిస్తారని పేర్కొంది. వివిధ రాజకీయ పార్టీలు నియమించిన 3,42,409 మందిబీఎల్‌ఏలు(బూత్ స్థాయి ఏజెంట్లు) ఈ ప్రక్రియలో బీఎల్‌వోలకు సహకరించనున్నట్టు తెలిపింది. ఎన్నికల అధికారులు, ఓటర్లు, రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో నిర్వహించనున్న ఈ ప్రక్రియలో పూర్తి పారదర్శకత కోసం అన్ని పోలింగ్ బూత్‌లకు ఏజెంట్లను నియమించాలని రాజకీయ పార్టీలను ఈసీ కోరింది. 3వ దశ సర్ ప్రక్రియను ముగించి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తుది ఓటర్ల జాబితాలను ఈ ఏడాదే వేర్వేరు తేదీల్లో ప్రకటిస్తామని పేర్కొంది. ముందుగా ఒడిసా, సిక్కిం, మిజోరం, మణిపూర్‌లకు సెప్టెంబరు 6న, చివరగా త్రిపురకు డిసెంబరు 23న తుదిజాబితాలు విడుదల చేస్తామ ని వెల్లడించింది. తొలి రెండు దశల్లో 59కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించామని, ఇందులో 6.3 లక్షల మందికిపైగా బీఎల్‌వోలు, 9.2 లక్షల మందికిపైగా బీఎల్‌ఏలూ పాల్గొన్నారని ఈసీ తెలిపింది. రెండో దశలో 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ ప్రక్రియ ద్వారా 10.2 శాతం ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. సర్ ప్రక్రియ చేపట్టకముందు ఆ 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 50.99 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 5.18 కోట్ల మంది పేర్లను తొలగించి, 45.81 కోట్ల మందితో తుది జాబితాను ప్రచురించారు.
తెలంగాణలో ఇలా..
తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలలో జూన్ 15 నుంచి 24వ తేదీ వరకు సన్నాహక, శిక్షణ, ప్రింటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు. వాటిని పరిష్కరించాక అక్టోబరు 1న ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తారు. తెలంగాణలో 3,39,20,705 మంది ఓటర్లు ఉండగా, 35,985 మంది బీఎల్‌వోలు, 25,886 మంది బీఎల్‌ఏలు సర్ ప్రక్రియలో పాల్గొననున్నారు. ఇక ఢిల్లీ, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో జూన్ 30 నుంచి జూలై 29 వరకు బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, హరియాణా, చండీగఢ్‌లలో జూన్ 6 నుంచి 14వ తేదీ వరకు సన్నాహక, శిక్షణ, ప్రింటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు.
ఓటర్లూ ఉత్సాహంగా పాల్గొనండి: సీఈసీ
మూడో దశ సర్ ప్రక్రియలో ఓటర్లంతా ఉత్సాహంగా పాల్గొని ఎన్యూమరేషన్ ఫామ్‌లను పూర్తిచేయాలని ముఖ్య ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ పిలుపునిచ్చారు. అర్హత కలిగిన ఓటర్ల పేర్లను మాత్రమే ఎన్నికల జాబితాలో ఉంచేందుకు, అనర్హుల పేర్లను తొలగించే లక్ష్యంతో సర్ ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు.