Share News

రాష్ట్రాలకు ‘గ్రాంట్లు’ బంద్‌

ABN , Publish Date - Feb 02 , 2026 | 03:37 AM

ఆర్థికంగా బలహీనంగా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రెవెన్యూ లోటు గ్రాంట్లు, ప్రత్యేక గ్రాంట్లను ఇకపై ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి 16వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది.

రాష్ట్రాలకు ‘గ్రాంట్లు’ బంద్‌

  • రెవెన్యూ లోటు, ప్రత్యేక గ్రాంట్లు అవసరం లేదు

  • ఖర్చులకు తగ్గట్టు సంపాదించుకునే శక్తి వాటికుంది

  • జీఎ్‌సడీపీలో ద్రవ్యలోటు 3 శాతానికి మించకూడదు

  • కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా

  • ఆమోదించిన ప్రభుత్వం.. లోక్‌సభలో పెట్టిన ఆర్థిక మంత్రి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ఆర్థికంగా బలహీనంగా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రెవెన్యూ లోటు గ్రాంట్లు, ప్రత్యేక గ్రాంట్లను ఇకపై ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి 16వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఖర్చులకు అవసరమైన నిధులను సమకూర్చుకొనే శక్తి రాష్ట్రాలకు ఉందని తెలిపింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ప్రస్తుతం ఇస్తున్న 41 శాతం వాటాను అలాగే కొనసాగించాలని సూచించింది. 16వ ఆర్థిక సంఘం నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ నివేదికను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ నివేదికలో ఆర్థిక సంఘం పలు కీలక సూచనలు చేసింది..

  • కేంద్ర పన్నుల్లో ప్రస్తుతం రాష్ట్రాలకు ఇస్తున్న 41 శాతం వాటానే వచ్చే ఐదేళ్లపాటు కొనసాగించాలి. కేంద్రం వసూలు చేసే సెస్‌లు, సర్‌చార్జీలు ఇందులోకి రావు. వాటిని పూర్తిగా కేంద్రమే తీసేసుకుంటుంది.

  • దాదాపు అన్ని రాష్ట్రాలు ఆర్థిక స్వావలంబన సాధించినట్లు నిర్ధారణకు వచ్చిన 16వ ఆర్థిక సంఘం.. ప్రస్తుతం పలు రాష్ర్ట్రాకు ఇస్తున్న రెవెన్యూ లోటు గ్రాంట్లు, ప్రత్యేక గ్రాంట్లను వచ్చే ఐదేళ్లకు కొనసాగించాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీంతో ఇకపై ఏ రాష్ట్రానికీ ఈ గ్రాంట్లు అందే అవకాశం లేదు.

  • వచ్చే ఐదేళ్లలో స్థానిక సంస్థలకు రూ.7.91 లక్షల కోట్లు గ్రాంట్లుగా ఇవ్వాలని కమిషన్‌ చేసిన సిఫారసును కేంద్రం ఆమోదించింది. ఇందులో 60 శాతం గ్రామీణ స్థానిక సంస్థలకు, 40 శాతం పట్టణ స్థానిక సంస్థలకు అందుతాయి. అయితే, ఆయా స్థానిక సంస్థల ప్రగతి ప్రదర్శన ఆధారంగానే నిధులు విడుదల చేస్తారు.

  • విపత్తు ప్రతిస్పందన, నిర్వహణకు వచ్చే ఐదేళ్ల కోసం రూ.2.04 లక్షల కోట్ల కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయాలన్న కమిషన్‌ సిఫారసును కేంద్రం ఆమోదించింది.

  • రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎ్‌సడీపీ)లో రాష్ట్రాల ద్రవ్యలోటు 3 శాతానికి మించకుండా కట్టడి చేయాలని కమిషన్‌ చేసిన సిఫారసును కేంద్రం ఆమోదించింది. రాష్ట్రాలు చేస్తున్న బడ్జెటేతర అప్పులను బడ్జెట్‌ ఖాతాల్లోకి తీసుకురావాలని చేసిన సిఫారసును కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదించింది. ఈ సిఫారసు అమల్లోకి రావాలంటే రాష్ట్రాల ఆర్థిక చట్టాలను కూడా సవరించాల్సి ఉంటుంది.

Updated Date - Feb 02 , 2026 | 03:37 AM