తెలంగాణలో జనగణన ఏప్రిల్ 26 నుంచి!
ABN , Publish Date - Mar 31 , 2026 | 04:56 AM
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త జనగణన మొదటి దశ తేదీలను సోమవారం ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు తొలిదశ జనగణన జరుగుతుంది.
మే 10 వరకు ఆన్‌లైన్లో వివరాలు ఇవ్వాలి
మే 11 నుంచి నెల రోజులపాటు క్షేత్ర స్థాయిలో సమాచార సేకరణ
షెడ్యూల్ ప్రకటించిన సెన్సస్ కమిషనర్
న్యూఢిల్లీ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త జనగణన మొదటి దశ తేదీలను సోమవారం ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు తొలిదశ జనగణన జరుగుతుంది. తొలిదశలో కుటుంబాలను, జీవన స్థితిగతులను గుర్తిస్తారు. రెండో దశ 2027 ఫిబ్రవరిలో జరుగుతుంది. అప్పుడు ప్రతి కుటుంబంలో వ్యక్తుల వివరాలతో పాటు ఒక్కొక్కరి కులం, జన సంఖ్య, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వివరాలను సేకరిస్తారు. మొదట పౌరులు ఆన్‌లైన్‌లో సొంత వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వచ్చి వివరాలను ధ్రువీకరించుకుంటారు. సొంతంగా నమోదు చేసుకోని కుటుంబాల వివరాలను ఎన్యూమరేటర్లే స్వయంగా ఇంటికి వచ్చి నమోదు చేస్తారు. ఏ కుటుంబాన్నీ మిస్ కానివ్వరు. తెలంగాణలో ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు, ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 16 నుంచి 30 వరకు సొంతంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసే కార్యక్రమం(సెల్ఫ్ ఎన్యూమరేషన్) ఉంటుంది. మే 11 నుంచి జూన్ 9 వరకు తెలంగాణలో, మే 1 నుంచి మే 30 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ వల్ల జనాభా లెక్కల విధుల్లోని వారి భారం తగ్గుతుంది. మన వివరాలు చెప్పేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్ ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు. భారత రిజిస్ట్రార్ జనరల్, జనాభా లెక్కల(సెన్సస్) కమిషనర్ మృత్యుంజయ కుమార్ నారాయణ్ సోమవారం విలేకరుల సమావేశంలో తొలిదశ జనగణన వివరాలను ప్రకటించారు. తొలిదశలో 33 ప్రశ్నలకు జవాబులు సేకరిస్తామని వెల్లడించారు. జనాభా లెక్కల సేకరణ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని, ఎక్కడా పెన్నూ కాగితం వాడరని చెప్పారు. ఎన్యూమరేటర్లు స్మార్ట్ ఫోన్‌లోని మొబైల్ యాప్ ద్వారా కుటుంబాల సమాచారాన్ని నమోదు చేసుకుంటారని చెప్పారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా సమర్పించేందుకు ఉద్దేశించిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ హిందీ, ఇంగ్లీషు సహా 16 భాషల్లో లభ్యమవుతుంది. మొబైల్ నంబర్, ఇతర మౌలిక వివరాలను పోర్టల్‌లో పేర్కొన్న తర్వాత ప్రతి కుటుంబానికి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ లభిస్తుంది. ఎన్యూమరేటర్ క్షేత్ర పర్యటనకు వచ్చినపుడు ఆ ఐడీ సమర్పించాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు 15 రోజులు కేటాయించగా తర్వాత నెల రోజులు ప్రత్యక్షంగా ఇంటింటి వివరాల సేకరణ జరుగుతుంది. గుజరాత్‌లో జనగణన తేదీలు మారే అవకాశాలున్నాయని, బెంగాల్లో జనగణన తేదీలను ఇంకా నిర్ణయించాల్సి ఉందని జనాభా లెక్కల కమిషనర్ తెలిపారు. ఇళ్లను వెబ్ మ్యాపింగ్ అప్లికేషన్ ద్వారా గుర్తిస్తారని చెప్పారు. 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, 784 జిల్లాలు, 5,127 పట్టణాలు, 6,39,902 గ్రామాల్లో జనాభా లెక్కల సేకరణ జరుగుతుందన్నారు.
ఆసక్తికర అంశాలు...
ఏప్రిల్, మేలలో జరిగే తొలిదశ జనాభా లెక్కల్లో ప్రధానంగా కుటుంబాన్ని గుర్తిస్తారు. కుటుంబ పెద్ద ఆధారంగా ఐడీ జనరేట్ అవుతుంది. ఆ ఐడీ కింద కుటుంబ జీవన స్థితిగతుల్ని గుర్తిస్తారు. 2027లో జరిగే రెండో దశ జనాభా లెక్కల్లో మాత్రమే కుటుంబంలోని వ్యక్తులందరి వివరాలను సేకరిస్తారు.
సహజీవనం చేసేవారు.. వాళ్లిద్దరూ తమను భార్యాభర్తలుగా పరిగణించడానికి అంగీకరిస్తే భార్యాభర్తలుగా గుర్తించి జనాభా లెక్కల్లో నమోదు చేస్తారు. ఎలాంటి ఆధారాలు చూపించనవసరం లేదు.
ఆన్‌లైన్ నమోదు ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు. అన్ని ప్రశ్నలకు సమాధానాలను గుర్తించి సేవ్ చేసుకుంటూ 15 రోజుల వ్యవధిలో పూర్తి చేయవచ్చు.
ఠ గడప గడప సర్వేకు జనాభా లెక్కల సిబ్బంది మీ ఇంటికి వచ్చినపుడు ఆన్‌లైన్‌లో నింపిన దరఖాస్తుకు సంబంధించిన ఐడీ తనకు ఇస్తే మరోసారి ప్రశ్నలు సమాధానాలను చెక్ చేసుకుంటారు.
ఒకసారి ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చేశాక అందులో మార్పులు చేయలేం. ఎన్యూమరేటర్ వచ్చినపుడు అడిగి మార్పులు చేసుకోవచ్చు.
నివాసం ఉండేది ఏ రకమైన ఇల్లు, వాహనాలు, ప్రధాన ఆహారం ఏం తీసుకుంటారు.. ఇలా 33 అంశాల వివరాలను తొలి దశలో అడుగుతారు. ఇంటి యజమాని పేరు పురుషుడా స్త్రీయా అనేది కూడా చెప్పాలి. జనాభా లెక్కల్లో భాగంగా సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు. సమాచార హక్కు చట్టం కింద అడిగినా ఇవ్వరు. కోర్టులో సాక్ష్యంగా అంగీకరించరు. 31 లక్షల మంది ఎన్యూమరేటర్లు జనాభా లెక్కల కార్యక్రమంలో పాల్గొంటారు. 2027 మార్చి 1వ తేదీన 00.00 గంటలకు ఈ జనాభా లెక్కలను ప్రకటిస్తారు.
బిల్లులపై తొందరెందుకు?
జనాభా లెక్కల వివరాలు 2027లోనే వస్తాయని జనాభా లెక్కల కమిషనర్ చెబుతుంటే మరోపక్క ప్రభుత్వం జనాభా లెక్కలు 2029 వరకు రావని పచ్చి అబద్ధాలు ఆడుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. ఆ సాకు చూపించి మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులను ఇప్పుడే ఆమోదించాలంటూ ముందుకు తోస్తోందని అన్నారు. మహిళా బిల్లును ఈ సమావేశాల్లోనే బలవంతంగా తోయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.