Share News

రక్తం లేని బాల్యం.. సత్తువ లేని మాతృత్వం!

ABN , Publish Date - Nov 25 , 2026 | 04:30 AM

బంగారు బాల్యం రక్తహీనత బారిన పడుతోంది. భవిష్యత్‌ తరాలకు జన్మనిచ్చే మాతృత్వం సత్తువ కోల్పోతోంది. తెలంగాణలో చిన్నారులు, మహిళల ఆరోగ్యంపై..

రక్తం లేని బాల్యం.. సత్తువ లేని మాతృత్వం!

  • రాష్ట్రంలో ఏడాది నుంచి ఐదేళ్ల చిన్నారుల్లో 47.4శాతం మందికి రక్తహీనత

  • జాతీయ సగటు 41.8శాతం కంటే అధికంగా సమస్య

  • 15-49 ఏళ్ల మహిళల్లో 54 శాతం మందిలో ఎనీమియా

  • 10-19 ఏళ్ల మధ్య బాలికల్లో 43.6 శాతంగా నమోదు

  • తెలంగాణలో బాల్యంపై ఆందోళనకరంగా గణాంకాలు

  • పురుషులు, వృద్ధుల్లో జాతీయ సగటు కంటే మెరుగైన పరిస్థితి

  • ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్‌ నిర్వహించిన ‘సంపద’ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): బంగారు బాల్యం రక్తహీనత బారిన పడుతోంది. భవిష్యత్‌ తరాలకు జన్మనిచ్చే మాతృత్వం సత్తువ కోల్పోతోంది. తెలంగాణలో చిన్నారులు, మహిళల ఆరోగ్యంపై ‘రక్తహీనత’ (ఎనీమియా) తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో పురుషులు, వృద్థులలో ఈ సమస్య జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నప్పటికీ.. ఐదేళ్లలోపు చిన్నారులు, పునరుత్పత్తి వయసు మహిళల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) నిర్వహించిన ‘సంపద’ (2023--2025) సర్వే నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 183 జిల్లాల్లో 81వేలకుపైగా కుటుంబాలకు చెందిన 2 లక్షలకుపైగా వ్యక్తుల నుంచి రక్త నమూనాలను సేకరించి, విశ్లేషించారు. సాధారణంగా ఆరోగ్య సర్వేల్లో రక్త నమూనాల సేకరణ కోసం వేలికి సూదిని గుచ్చి, రక్తం తీసుకుంటారు. కానీ ఈసారి చేతి సిరల నుంచి ఇంజెక్షన్‌ తరహాలో రక్త నమూనాలను సేకరించారు. హిమోగ్లోబిన్‌ అంచనా కోసం ఆటోమేటెడ్‌ ఎనలైజర్లను ఉపయోగించారు. హిమోగ్లోబిన్‌తోపాటు ఇనుము (ఐరన్‌), ఫోలేట్‌, విటమిన్‌ బి12 స్థాయిలను, ఇన్ఫెక్షన్లను సూచించే బయోమార్కర్లను కూడా పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.


ఐరన్‌ మాత్రమే కాదు.. విటమిన్ల లోపమూ కారణమే!

దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం స్వల్ప స్థాయి (మైల్డ్‌) తీవ్రత కలిగినవేనని సర్వే పేర్కొంది. అయితే రక్తహీనతకు కేవలం ఐరన్‌ లోపమే కాకుండా విటమిన్‌ బి12, ఫోలేట్‌ వంటి సూక్ష్మపోషకాల లోపం కూడా ప్రధాన కారణమని తెలిపింది. చిన్నారులు, కౌమార బాలికలు, మహిళలపై ప్రత్యేక దృష్టి సారించి తొలి దశలోనే పౌష్టికాహారం అందించడం, తగిన వైద్యపరమైన జాగ్రత్తలు చేపడితే.. రక్తహీనత సమస్యను అరికట్టవచ్చని తేల్చిచెప్పింది.

ఐదేళ్లలోపు చిన్నారుల్లో రక్త హీనత

తెలంగాణలో ఏడాది నుంచి ఐదేళ్ల వయసున్న చిన్నారుల్లో 47.4 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇది జాతీయ సగటు (41.8శాతం) కంటే 5.6 శాతం ఎక్కువ. 5-9 ఏళ్ల మధ్య ప్రాథమిక పాఠశాల స్థాయి పిల్లల్లో కాస్త ఊరటనిచ్చేలా 23.8 శాతం (జాతీయ సగటు 31.3శాతం) రక్తహీనత కనిపించింది. ఇక మహిళలు, బాలికల్లో రక్తహీనత ప్రభావం తీవ్రంగా ఉంది. 15-49 ఏళ్ల మధ్య వయసున్న సాధారణ మహిళల్లో 54 శాతం రక్తహీనతతో బాధ పడుతున్నారు. జాతీయ సగటు (55.9శాతం) కంటే 1.9శాతం తక్కువగానే ఉన్నా.. కలవరపెట్టే అంశమే! కౌమార బాలికల్లో (10-19 ఏళ్లు) 43.6 శాతం (జాతీయ సగటు 46.3శాతం), 20-59 ఏళ్ల మహిళల్లో 51.0 శాతం (జాతీయ సగటు 54.8శాతం) మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో 10-19 ఏళ్ల కౌమార బాలురు, 20-59 ఏళ్ల వయసు పురుషులలో రక్తహీనత జాతీయ స్థాయిలో 22-23 శాతం ఉండగా, తెలంగాణలో 12.5శాతంగానే ఉండటం ఊరటనిచ్చే అంశం. అలాగే, జాతీయ స్థాయిలో తొలిసారిగా అంచనా వేసిన 60ఏళ్లుపైబడిన వృద్ధుల విభాగంలోనూ జాతీయ సగటు (మహిళల్లో 55.7శాతం, పురుషుల్లో 44.7 శాతం)తో పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితి ఆశాజనకంగా (మహిళల్లో 44.8శాతం, పురుషుల్లో 28.6 శాతంగా) ఉంది.

Updated Date - Nov 25 , 2026 | 04:32 AM