ఉమ్మడి ఏపీ విభజన భారత్-పాక్ విభజన కంటే దారుణం
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:49 AM
యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను దారుణంగా విభజించిందని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యానించారు. బ్రిటీష్ వాళ్లు చేసిన భారత్-పాక్ విభజన కంటే దారుణంగా ఉమ్మడి ఏపీ....
కాంగ్రెస్ వారసత్వం అటువంటిది
రేవంత్ హైబ్రిడ్ మోడల్ అసంబద్ధం
సంపన్న రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు..పేద రాష్ట్రాలకు తక్కువ సీట్లు ఉండాలా?
అలా అంటే అంబానీకి లక్ష ఓట్లు ఉంటాయి
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను దారుణంగా విభజించిందని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యానించారు. బ్రిటీష్ వాళ్లు చేసిన భారత్-పాక్ విభజన కంటే దారుణంగా ఉమ్మడి ఏపీ విభజన జరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వారసత్వం అటువంటిదని మండిపడ్డారు. గురువారం లోక్‌సభలో డీలిమిటేషన్, 131వ రాజ్యాంగ సవరణ బిల్లులపై జరిగిన చర్చలో తేజస్వీ సూర్య మాట్లాడారు. ‘‘లోక్‌సభ సీట్ల సంఖ్యను రాష్ట్ర జీఎ్‌సడీపీతో ముడిపెట్టాలంటూ సీఎం రేవంత్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ అత్యంత అసంబద్ధం, మూర్ఖత్వంతో కూడుకున్నది. సంపన్న రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు, పేద రాష్ట్రాలకు తక్కువ సీట్లు ఉండాలనడం రాజ్యాంగ విరుద్ధం. బిహార్‌లోని ఓటు విలువ కంటే తెలంగాణలోని ఓటు విలువ ఎక్కువగా ఉండాలా? ధనవంతులకు ఎక్కువ ఓట్లు, పేదలకు తక్కువ ఓట్లు ఉండాలా? పేదల ఓటుకు విలువ ఉండదా? ఇదేం వాదన? ఈ వాదనను అమలు చేస్తే ముఖేశ్ అంబానీకి లక్ష ఓట్లు ఉంటాయి. నాలాంటి సామాన్యుడికి ఒక ఓటే ఉంటుంది. అయినా జీడీపీ ఆరు నెలలకోసారి మారుతుంటుంది. వానలు బాగా పడితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడి సీట్లు పెరగడం, కరువు వస్తే సీట్లు తగ్గడం అనే లాజిక్ హాస్యాస్పదంగా ఉంది’’ అని తేజస్వీ సూర్య వ్యాఖ్యానించారు. లోక్‌సభ సీట్ల పునర్విభజనను వ్యతిరేకించే వాదనలు దుర్మార్గమైనవని విమర్శించారు. 2027 లేదా 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని.. అందువల్ల అన్ని రాష్ట్రాలకు 50శాతం పెంపు సూత్రం సరైనదని పేర్కొన్నారు.
మెరుగ్గా నిధులిచ్చింది మోదీ ప్రభుత్వమే..
కేంద్రం నుంచిదక్షిణాది రాష్ట్రాలకు నిధుల బదిలీని చూసినా.. యూపీఏ పదేళ్ల పాలనతో పోలిేస్త, మోదీ ప్రభుత్వ హయాంలో 250 శాతానికిపైగా ఎక్కువగా నిధులు అందాయని తేజస్వీ సూర్య పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్‌లో ప్రాధాన్యం పెరిగిందన్నారు. దక్షిణాదిన రైల్వే విద్యుదీకరణ గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో జరిగిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 2009- 2014 మధ్య కేవలం రూ.886 కోట్లు అందితే.. మోదీ ప్రభుత్వం విభజిత ఏపీ రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించిందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేందుకు డీలిమిటేషన్ చేపట్టారనడం కంటే పెద్ద అబద్ధం మరొకటి లేదని.. దేశాన్ని తుక్డే తుక్డే (ముక్కలు ముక్కలు)గా చూడటం తమ పార్టీ సంస్కృతి కాదని విమర్శించారు. 2023లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించినప్పుడు.. జనగణన, పునర్విభజన తర్వాతే అమలు అవుతుందన్న నిబంధనకు అన్ని పార్టీలు అంగీకరించాయని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. దక్షిణాదికి రవ్వంత అన్యాయం జరిగినా కన్నడిగుడిగా తానే మొదట నిరసన తెలిపేవాడినని చెప్పారు.