Share News

వాయుసేనకు కొత్త తేజస్‌

ABN , Publish Date - Apr 27 , 2026 | 04:20 AM

మన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) దేశీయంగా అభివృద్ధి చేస్తున్న తేజస్‌ ఎంకే2 విమానం ఫస్ట్‌ ఫ్లైట్‌కు దాదాపు సిద్ధమైంది. తొలుత టాక్సీ ట్రయల్స్‌ నిర్వహించి..

వాయుసేనకు కొత్త తేజస్‌

  • ఫస్ట్‌ ఫ్లైట్‌కు సిద్ధమైన తేజస్‌ ఎంకే2

(సెంట్రల్‌ డెస్క్‌)

మన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) దేశీయంగా అభివృద్ధి చేస్తున్న తేజస్‌ ఎంకే2 విమానం ఫస్ట్‌ ఫ్లైట్‌కు దాదాపు సిద్ధమైంది. తొలుత టాక్సీ ట్రయల్స్‌ నిర్వహించి (నేలపై నడిపి) ఆ తర్వాత రెండు రోజుల్లోనే ఫస్ట్‌ ఫ్లైట్‌ నిర్వహించనున్నట్టు సమాచారం. డీఆర్‌డీవోనే అభివృద్ధి చేసిన 4.5 జనరేషన్‌ యుద్ధవిమానాలైన ‘తేజస్‌ ఎంకే-1ఏ’లు ఐదారు విమానాలు సిద్ధంగా ఉన్నాయిగానీ.. వాటిని వాయుసేన అమ్ములపొదిలోకి ఇంకా చేర్చలేదు. అయితే, ఆ విమానాలతో పోలిస్తే తేజస్‌ ఎంకే2 విమానాలు మరింత శక్తిమంతమైనవి. వాటి ఇంధన సామర్థ్యం, రేంజ్‌, ఫ్రంటల్‌ (ముందువైపు) స్టెల్త్‌ సామర్థ్యం చాలా ఎక్కువ. ఎక్కువ ఆయుధాలను మోసుకెళ్లగలవు. తేజస్‌ ఎంకే-1ఏ విమానాల్లో వాడిన ఇంజన్లు జీఈ ఎఫ్‌-404 రకంవైతే.. తేజస్‌ ఎంకే2లో వాడిన ఇంజన్లు వాటికంటే శక్తిమంతమైన ఎఫ్‌-414 ఇంజన్లు. అమెరికా ఎఫ్‌-18 యుద్ధవిమానాల్లో వాడే ఇంజన్లు ఇవే. రేడార్‌, ఎలకా్ట్రనిక్‌ వార్‌ఫేర్‌లో తేజస్‌ ఎంకే2 విమానాలు రఫేల్‌ కంటే మెరుగైన సామర్థ్యం కలిగినవి. ఇందులో వాడే ఉత్తమ్‌ రేడార్‌.. గాలియం నైట్రైడ్‌ రేడార్‌. రఫేల్‌ రేడార్‌ కంటే ఎక్కువ రేంజ్‌ (200 కి.మీ.) కలిగి ఉంటుంది. శత్రుదేశాలు జామింగ్‌ చేయకుండా తట్టుకుని నిలబడగలదు. రఫేల్‌తో పోలిస్తే.. ఎక్కువ ఎత్తులో బాగా పనిచేయగలదు. రఫేల్‌ 52 వేల అడుగుల ఎత్తులో పనిచేస్తే.. తేజస్‌ ఎంకే2 56 వేల అడుగుల ఎత్తులో కూడా పనిచేస్తుంది. దీనివల్ల ఈ విమానాలు హిమాలయాల్లో యుద్ధానికి బాగా ఉపయోగపడతాయి.

Updated Date - Apr 27 , 2026 | 04:20 AM