Share News

‘నీ భార్యను పంపించు..’నాసిక్‌ టీసీఎస్‌లో ఓ ఉద్యోగి పట్ల టీమ్‌ లీడరు బరి తెగింపు

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:08 AM

నాసిక్‌ టీసీఎస్‌లో వెలుగుచూసిన కార్పొరేట్‌ జిహాద్‌ వ్యవహారంలో దిగ్ర్భాంతికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు మహిళా టెకీలే బయటకొచ్చి లైంగికపరంగా, మతపరంగా తమపై జరుగుతున్న దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘నీ భార్యను పంపించు..’నాసిక్‌ టీసీఎస్‌లో ఓ ఉద్యోగి పట్ల టీమ్‌ లీడరు బరి తెగింపు

  • ముస్లిం టోపీ ధరించి రావాలని,కల్మా పఠించాలని తీవ్ర ఒత్తిడి

  • పురుష ఉద్యోగులపైనా వేధింపులు

  • ఇప్పటివరకు ఆరుగురి అరెస్టు

  • నాసిక్‌ టీసీఎస్‌ తాత్కాలికంగా మూత

నాసిక్‌, ఏప్రిల్‌ 16: నాసిక్‌ టీసీఎస్‌లో వెలుగుచూసిన కార్పొరేట్‌ జిహాద్‌ వ్యవహారంలో దిగ్ర్భాంతికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు మహిళా టెకీలే బయటకొచ్చి లైంగికపరంగా, మతపరంగా తమపై జరుగుతున్న దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పురుష ఉద్యోగులు సైతం తాము అనుభవించిన నరకంపై నోరు విప్పడం మొదలుపెట్టారు. పని స్థలంలో కావాలని వేధింపులకు గురిచేయడం నుంచి అత్యంత సున్నితమైన వ్యక్తిగత భావాలపై దాడులు చేయడం, మత మార్పిళ్లకు ఒత్తిడి చేయడం దాకా.. ఎలా నాసిక్‌ టీసీఎస్‌లోని కొందరు టీమ్‌ లీడర్లు మానసికంగా చిత్రవధ చేసిందీ వివరిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని నాసిక్‌ పోలీసులు అరెస్టు చేయగా, హెచ్‌ఆర్‌ మహిళా అధికారి పరారీలో ఉన్నారు. నాసిక్‌ టీసీఎస్‌ను యాజమాన్యం తాత్కాలికంగా మూసివేసింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని సంస్థ సిబ్బందికి గురువారం ఆదేశాలు జారీచేసింది. సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తాజాగా పోలీసులకు టీమ్‌ లీడరు తౌసిఫ్‌ అక్తర్‌పై ఫిర్యాదు చేశారు. ‘నీ భార్యను పంపించు’ అని అతడు అన్నట్టు ఫిర్యాదులో తెలిపారు. ఆ ఫిర్యాదులోని అంశాలు అతని మాటల్లోనే.. ‘‘మాకు చాలా కాలంగా పిల్లలు లేరు. ఒకసారి మా వైవాహిక సంబంధం గురించి తౌసిఫ్‌ అక్తర్‌ ఆరాతీశాడు. ‘నీ భార్యను నా దగ్గరకు పంపించు. నిన్ను తండ్రిని చేస్తా’నంటూ అశ్లీల పదజాలంతో మాట్లాడాడు. అక్కడే ఉన్న తోటి ఉద్యోగి డానిష్‌ షేక్‌ అదే తరహాతో మాట్లాడాడు. దీనిపై గొడవ జరగ్గా కోపంతో తౌసిఫ్‌ టేబుల్‌ ఫ్యాన్‌ ను నాకు తగిలేలా విసిరికొట్టాడు. చంపేస్తానని బెదిరించాడు. దీనిపై హెచ్‌ఆర్‌కు ఫిర్యాదు చేశాను. ఆ తర్వాత దాని గురించి నేను మరిచిపోయినా.. వాళ్ల వేధింపులు ఆగలేదు. హెడ్‌ ఆఫీ్‌సకు నాపై వ్యతిరేక నివేదికలు పంపేవారు. మతం మారాలని ఒత్తిడి తెచ్చినా నేను అంగీకరించలేదు. దీంతో తౌసిఫ్‌ బృందం అకారణంగా నాపై విరుచుకుపడేది. వారి మాట విననందుకు నన్ను, ఇతర ఉద్యోగులను వేధింపులకు గురిచేశారు’’ అని వాపోయారు. ముస్లిం టోపీ ధరించి కార్యాలయానికి రావాలని, కల్మా పఠించాలని, నమాజ్‌ చేయాలని ఒత్తిడి చేసేవారని తెలిపారు. ‘‘మా తోటి ఉద్యోగిని ఒకసారి తౌసిఫ్‌, డానిష్‌ల అకృత్యాల గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె పట్ల వాళ్లు అమర్యాదగా ప్రవర్తించారు. తాము లక్ష్యంగా చేసుకున్న మహిళా టెకీలను కార్యాలయవేళలు ముగిసినా ఆఫీస్ లోనే ఉంచేసి వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవారు’’అని ఆ ఉద్యోగి ఫిర్యాదులో తెలిపారు.


ఫిర్యాదు తీసుకోలేదు: ఓ మహిళా ఉద్యోగిని

తౌసిఫ్‌ తదితరులపై ఫిర్యాదులను హెచ్‌ఆర్‌ తీసుకునేవారుకాదని ఓ కాంట్రాక్టు ఉద్యోగిని తెలిపారు. ‘‘వాళ్లు నన్ను కార్యాలయంలోని చివరి అంతస్థులో పని కి నియమించారు. నా దగ్గర ఫోన్‌, బ్యాగ్‌ ఉండనిచ్చేవారు కాదు. మాలో 20-25 ఏళ్లలోపు మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు’’అని ఆమె తెలిపారు. మతం మార్చుకోవాలని తౌసిఫ్‌ బృందం తోటి ఉద్యోగులను వేధించేవారన్నారు. కాగా, కార్పొరేట్‌ జిహాద్‌ వ్యవహారం సంస్థ ఉన్నతాధికారులకు తెలియకుండా జరిగి ఉండదని ‘సిట్‌’వర్గాలు భావిస్తున్నాయి. హెచ్‌ఆర్‌ మహిళా అధికారి నిదా ఖాన్‌ను ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్నాయి. అరెస్టుల తర్వాత నిందితుల్లోని ఒకరిని నాసిక్‌ టీసీఎస్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌తో మాట్లాడినట్టు ఈ వర్గాలు తెలిపాయి. కాగా, ఐటీ సంస్థల్లో వెలుగు చూస్తున్న చీకటి వ్యవహారాలతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల సిబ్బంది ఏ ఇబ్బంది వచ్చినా సంప్రదించేందుకు వీలుగా హెల్ప్‌లైన్‌ నంబరును తేవాలనుకుంటోంది.

Updated Date - Apr 17 , 2026 | 03:08 AM