‘తనిష్క్’లో భారీ దోపిడీ
ABN , Publish Date - Nov 13 , 2026 | 02:15 AM
మదురైలోని తనిష్క్ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. 15 రోజుల క్రితమే ప్రారంభమైన ఈ షోరూమ్‌లో దొంగలు తమ చేతివాటం చూపించారు.
రూ.50 కోట్ల విలువైన 35 కిలోల బంగారు, వజ్రాభరణాలు చోరీ
తమిళనాడులోని మదురైలో 15 రోజుల క్రితమే ప్రారంభమైన తనిష్క్ నగల దుకాణంలో ఘటన
నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలు
చెన్నై, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మదురైలోని తనిష్క్ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. 15 రోజుల క్రితమే ప్రారంభమైన ఈ షోరూమ్‌లో దొంగలు తమ చేతివాటం చూపించారు. మదురైలో ఇప్పటికే రెండు తనిష్క్ నగల దుకాణాలుండగా, రెండు వారాల క్రితం నెహ్రూ నగర్ ప్రాంతంలో మూడో శాఖ ప్రారంభమైంది. దీపావళి సమీపిస్తుండడంతో భవన నిర్మాణ పనులు పూర్తి కాకుండానే హడావుడిగా ఈ షోరూంను ప్రారంభించినట్టు సమాచారం. షాపు వెనుక వైపు ఇంకా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. షోరూంలో సుమారు 50 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో కొంతమంది బయటి ప్రాంతాలకు చెందినవారు కావడంతో షోరూం పైభాగంలోనే బస కల్పించారు. బుధవారం రాత్రి దుకాణం మూసివేసి వెళ్లిన మేనేజర్.. గురువారం ఉదయం తెరిచి చూడగా నగలు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఎస్ కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులతో ఆధారాలు ేసకరించారు. బుధవారం అర్థరాత్రి తర్వాత ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు షోరూమ్‌లోకి ప్రవేశించినట్టు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు.
భవనం వెనుకవైపు నుంచి పైఅంతస్తుకు చేరుకుని.. లిఫ్ట్ కోసం ఏర్పాటు చేసిన షాఫ్ట్ ద్వారా లోపలికి దిగినట్టు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. షోరూమ్‌లో ప్రదర్శనకు ఉంచిన ఆభరణాల్లో సుమారు 30 శాతాన్ని దొంగలు ఎత్తుకెళ్లినట్టు మదురై నగర పోలీస్ కమిషనర్ ఎస్.రాజేంద్రన్ తెలిపారు. లాకర్లలో భద్రపరిచిన నగలను మాత్రం ముట్టుకోలేదని వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ముగ్గురు ఏసీపీల ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.