Share News

ద్రవిడ పార్టీలు అవుట్‌

ABN , Publish Date - May 05 , 2026 | 05:52 AM

ద్రవిడ సిద్ధాంతాలకు పెట్టింది పేరైన తమిళనాట తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సంచలనం సృష్టించింది. మద్రాసు రాష్ట్రం తమిళనాడుగా మారిన తర్వాత ద్రవిడ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా విజయం సాధించి రికార్డులకెక్కింది.

ద్రవిడ పార్టీలు అవుట్‌

  • ఆరు దశాబ్దాల తర్వాత తమిళనాట పీఠానికి దూరం

  • ఆ సిద్ధాంతంతో సంబంధం లేకుండా ‘టీవీకే’ పార్టీ గెలుపు

(చెన్నై, ఆంధ్రజ్యోతి)

ద్రవిడ సిద్ధాంతాలకు పెట్టింది పేరైన తమిళనాట తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సంచలనం సృష్టించింది. మద్రాసు రాష్ట్రం తమిళనాడుగా మారిన తర్వాత ద్రవిడ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా విజయం సాధించి రికార్డులకెక్కింది. సుమారు ఆరు దశాబ్దాల తరువాత తొలిసారిగా తమిళనాట ద్రవిడ సిద్ధాంత పార్టీలు కాకుండా మరో పార్టీ అధికారం చేపట్టడం విశేషం. స్వాతంత్ర్యానంతరం మద్రాస్‌ ప్రెసిడెన్సీకి ఓపీ రామస్వామి రెడ్డియార్‌, పీఎస్‌ కుమారస్వామి రాజా, సి.రాజగోపాలాచారి, కె.కామరాజ్‌, ఎం.భక్తవత్సలం వంటి నేతలు సీఎంలుగా వ్యవహరించారు. ద్రవిడ సిద్ధాంతాలతో ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే)ను స్థాపించిన సీఎన్‌ అన్నాదురై.. రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ 1967 మార్చి 6న అధికారంలోకి వచ్చారు. ఆయన మరణానంతరం ఆపద్ధర్మ సీఎంగా వీఆర్‌ నెడుంజెళియన్‌, ఆ తరువాత కరుణానిధి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. తరువాతి కాలంలో కూడా కరుణానిధి మరో మూడుమార్లు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. కరుణానిధితో ఏర్పడిన విభేదాలతో ఏఐఏడీఎంకేను స్థాపించిన ఎంజీఆర్‌ 1977లో అధికారం చేపట్టారు. ఎంజీఆర్‌ మరణానంతరం ఆయన సతీమణి జానకి రామచంద్రన్‌, జయలలిత, ఒ.పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి అన్నాడీఎంకే నుంచి ముఖ్యమంత్రులయ్యారు. ఇక 2021 మేలో స్టాలిన్‌ సీఎం పీఠమెక్కారు. అయితే వీరంతా ద్రవిడ సిద్ధాంతాలతో కూడిన పార్టీలకు చెందిన వారే.

పేరులోనే విజయం

విజయ్‌ స్థాపించిన పార్టీ పేరులో విజయం ఉంది. ‘తమిళగ వెట్రి కళగం’ అంటే ‘తమిళుల విజయం పార్టీ’ అని అర్థం. ద్రవిడ అనే పదం లేకుండా పార్టీని స్థాపించిన విజయ్‌ తొలి పోరులోనే విజయం సాధించారు.

తమిళ పీఠంపై తొలి క్రైస్తవుడు

తమిళనాడు చరిత్రలో సీఎం పీఠమెక్కనున్న తొలి క్రైస్తవుడు విజయ్‌ కావడం మరో విశేషం. విజయ్‌ తండ్రి సినీ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌.. రామేశ్వరం సమీపంలోని తంగచ్చిమఠం ప్రాంతానికి చెందిన రోమన్‌ క్యాథలిక్‌ కుటుంబంలో జన్మించారు. విజయ్‌ తల్లి శోభ హిందువు. ఆమె సాయిబాబాకు పరమ భక్తురాలు. వారి కుటుంబంలో రెండు మతాచారాలను అవలంభిస్తుంటారని చెబుతుంటారు. విజయ్‌ చర్చితో పాటు ఆలయాలు, మసీదుల్లో కూడా పలుమార్లు పూజలు, ప్రార్థనలు నిర్వహించారు.

Updated Date - May 05 , 2026 | 05:52 AM