హత్యాచారం కేసులో దోషికి రెండు ఉరిశిక్షలు
ABN , Publish Date - May 26 , 2026 | 04:07 AM
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ప్లస్‌టూ(12వ తరగతి) విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి ఆపై దారుణంగా హతమార్చిన దోషికి రెండు ....
తమిళనాడులోని తూత్తుకుడి పోక్సో కోర్టు తీర్పు
చెన్నై, మే 25 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ప్లస్‌టూ(12వ తరగతి) విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి ఆపై దారుణంగా హతమార్చిన దోషికి రెండు ఉరిశిక్షలు విధిస్తూ పోక్సో కోర్టు సంచలనాత్మకమైన తీర్పు వెలువరించింది. నేరం జరిగిన 76 రోజుల్లోనే పోలీసులు తగిన సాక్ష్యాధారాలను సమర్పించిన నేపథ్యంలో కోర్టు ఈ తీర్పును ప్రకటించింది.. తూత్తుకుడి జిల్లా విళాత్తికుళం సమీపంలో ఉన్న వేడనత్తం గ్రామానికి చెందిన 17 ఏళ్ల ప్లస్‌టూ విద్యార్థిని మార్చి 10న రాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మరుసటి రోజు ఉదయం వేడనత్తం అటవీప్రాంతంలో ఒంటినిండా గాయాలతో ఉన్న ఆ బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినిపై అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. పోలీసులు 98 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, 2,574 ఫోన్ కాల్స్‌ను విశ్లేషించి నిందితుడు ధర్మమునీశ్వరన్(37)ను అరెస్టు చేశారు.