ఎమ్మెల్యేల కొనుగోలుపై సీబీఐతో దర్యాప్తు!
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:04 AM
తమిళనాడులో టీవీకే ప్రభుత్వం మెజారిటీ కోసం ఇతర పార్టీల శాసనసభ్యులతో బేరసారాలు సాగిస్తూ.. వారితో రాజీనామా చేయించి, తమ పార్టీలో...
అన్నాడీఎంకే డిమాండ్‌కు డీఎంకే మద్దతు
చెన్నై, మే 31(ఆంధ్రజ్యోతి): తమిళనాడులో టీవీకే ప్రభుత్వం మెజారిటీ కోసం ఇతర పార్టీల శాసనసభ్యులతో బేరసారాలు సాగిస్తూ.. వారితో రాజీనామా చేయించి, తమ పార్టీలో చేర్చుకుంటుండటంపై సీబీఐతో విచారణ జరిపించాలని అన్నాడీఎంకే చేస్తున్న డిమాండ్‌కు డీఎంకే మద్దతు తెలిపింది. డీఎంకే సీనియర్ నాయకుడు టీకేఎస్ ఇలంగోవన్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ అన్నాడీఏంకే నేతలు ఈ అవినీతిపై సీబీఐ విచారణ కోరటం సహేతుకమేనన్నారు. ఈ డిమాండ్‌కు తమ పార్టీ మద్దతునిస్తుందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కొద్ది రోజులకే నలుగురు అన్నాడీఎంకే శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి, ఆ వెంటనే టీవీకేలో చేరాల్సిన అవసరం ఏమొచ్చిందో? ఈ మొత్తం తతంగం వెనుక దాగిన రహస్యాలేమిటో బహిర్గతం కావాలంటే సీబీఐతో విచారణ జరపడం మినహా మరో మార్గం లేదన్నారు. ఇటీవలే మధురాంతకం ఎమ్మెల్యే కె. మరగతం కుమరవేల్, పెరుందురై ఎమ్మెల్యే ఎస్. జయకుమార్, తారాపురం ఎమ్మెల్యే సత్యభామ, అంబాసముద్రం ఎమ్మెల్యే ఇసక్కి సుబ్బయ్య తమ పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరారు.