హేమాహేమీలకు ‘విజిల్’ మోత!
ABN , Publish Date - May 05 , 2026 | 05:47 AM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే దెబ్బకు హేమాహేమీలు గల్లంతయ్యారు. సీఎం స్టాలిన్ నుంచి డీఎంకే సీనియర్ మంత్రులు ..
సీఎంతో పాటు పలువురు మంత్రులకూ పరాభవం
చెన్నై, మే 4(ఆంధ్రజ్యోతి): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే దెబ్బకు హేమాహేమీలు గల్లంతయ్యారు. సీఎం స్టాలిన్ నుంచి డీఎంకే సీనియర్ మంత్రులు దురైమురుగన్, కేకేఎ్‌సఎ్‌సఆర్ రామచంద్రన్, ఆర్.గాంధీ, ఆర్.రాజేంద్రన్, గీతా జీవన్, పళనివేల్ త్యాగరాజన్, పి.మూర్తి, టీఆర్‌బీ రాజా, అన్బిల్ మహేశ్ పొయ్యామొళి, ఎస్‌ఎం నాజర్, ఎంపీ సామినాథన్, దామో అన్బరసన్, ఎం.సుబ్రమణ్యం, ఎస్.ముత్తుసామితో పాటు అసెంబ్లీ స్పీకర్ అప్పావు, కేంద్ర మంత్రి ఎల్.మురుగన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్, మాజీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ తదితరులు పరాజయం పాలయ్యారు.
అయ్యో.. పాపం కాంగ్రెస్!
అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీవీకేతో చేతులు కలిపేందుకు కాంగ్రెస్ పార్టీ తహతహలాడింది. ఆ పార్టీకి 80 స్థానాలు, ఆరు మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధమని విజయ్ పంపిన రాయబారంతో కాంగ్రెస్ రాష్ట్ర నేతలు విపరీతంగా ఆకర్షితులయ్యారు. టీవీకేతో కాంగ్రెస్ పొత్తు దాదాపు ఖాయమని అందరూ భావించారు. అయితే జాతీయ స్థాయిలో వున్న పొత్తుల దృష్ట్యా డీఎంకేతోనే కలసి సాగాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఒకవేళ టీవీకేతో కలసి సాగితే, తాము 50కి పైగా స్థానాల్లో గెలిచి ఉండేవారమని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు.