దాహం తీర్చమంటే.. తన్నారు
ABN , Publish Date - Nov 10 , 2026 | 03:01 AM
స్థానిక సమస్యలపై ఫిర్యాదు చేసినందుకు ఓ వ్యక్తిపై తమిళనాడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, టీవీకే ఎమ్మెల్యే రవిశంకర్ విచక్షణారహితంగా దాడి చేశారు.
సామాన్యుడిపై తమిళనాడు డిప్యూటీ స్పీకర్ ప్రతాపం
చెన్నై, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక సమస్యలపై ఫిర్యాదు చేసినందుకు ఓ వ్యక్తిపై తమిళనాడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, టీవీకే ఎమ్మెల్యే రవిశంకర్ విచక్షణారహితంగా దాడి చేశారు. వారం రోజులుగా తమ ప్రాంతానికి తాగునీరు రావడం లేదని, తమ ప్రాంత ప్రజలు దాహార్తితో అల్లాడిపోతున్నారని ఆ వ్యక్తి ఫిర్యాదు చేయడమే నేరమైంది! ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తిరుచ్చి జిల్లా తురైయూరు కన్నభిరాన్ కాలనీకి చెందిన కార్తీక్ కుమార్ వ్యక్తిగత పనిపై ఆదివారం రాత్రి మనచ్ఛనల్లూరుకు వెళ్లారు. అనుకోకుండా అక్కడ ఎదురైన రవిశంకర్‌కు తమ ప్రాంత సమస్యలను ఏకరువు పెట్టారు. తమ ప్రాంతంలో మంచినీరు రావడం లేదని, తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రవిశంకర్.. ‘ఏ ఊరు రా నీది’ అని దూషిస్తూ ఆ వ్యక్తిపై దాడి చేశారు. ‘మీకే ఓటేశానండీ.. దళపతి కోసం ఓటేశానండీ.. నేను అడిగింది మంచినీళ్లేనండీ’ అంటూ ఆ వ్యక్తి నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా రవిశంకర్ ఆగకుండా కాలితో తన్నుతూ, పిడిగుద్దులు కురిపిస్తూ తీవ్రంగా దాడి చేశారు.